Ned Price Modi BBC : మోడీ బీబీసీ డాక్యుమెంటరీపై నో కామెంట్
స్పందించిన అమెరికా ప్రతినిధి నెడ్ ప్రైస్
Ned Price Modi BBC : ప్రపంచ వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించి అమెరికా ప్రభుత్వ ప్రతినిధి నెడ్ ప్రైస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో అమెరికా లోతైన సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటుందని తెలిపారు.
ఇరు దేశాలు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న గోద్రా ఘటనను మరోసారి ప్రస్తావించింది. ఆయన ప్రధానమంత్రిగా కొలువు తీరాక మైనార్టీ వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొంది.
దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది భారత ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మండిపడ్డారు. ఇదే సమయంలో బీబీసీ డాక్యుమెంటరీకి సంబంధించిన అన్ని లింకులను సోషల్ మీడియా సంస్థలు వెంటనే బ్లాక్ చేయాలని మోదీ బీజేపీ ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
ఈ తరుణంలో అమెరికా ప్రతినిధి నెడ్ ప్రైస్(Ned Price Modi BBC) స్పందించారు. మీరు ప్రస్తావిస్తున్న డాక్యుమెంటరీ గురించి తనకు తెలియదన్నారు. అయినప్పటికీ యునైటెడ్ స్టేట్స్ , భారత దేశం రెండూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.
వ్యూహాత్మాక భాగస్వామ్యాన్ని బలపరిచే అనేక అంశాలు ఉన్నాయని, రాజకీయ, ఆర్థిక , ప్రజల నుండి ప్రజల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్ తో అమెరికా పంచుకునే భాగస్వామ్యం అనూహ్యంగా లోతైనదని పేర్కొన్నారు నెడ్ ప్రైస్.
Also Read : జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలి