Sanjay Raut : శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన ప్రకటన చేశారు. మరాఠా రాజధాని , దేశ ఫైనాన్షియల్ కేపిటల్ సిటీగా పేరొందిన ముంబై లో భారతీయ జనతా పార్టీ యేతర రాష్ట్రాలకు చెందిన సీఎంల సమావేశం జరుగుతుందని వెల్లడించారు.
ఇది త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. ఈ కీలక భేటీలో దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేట్రేగిపోతున్న మతోన్మాదం, పలు రాష్ట్రాలలో చోటు చేసుకుంటున్న అల్లర్లు, విధ్వంసకాండ, కేంద్ర ఆధీనంలోని దర్యాప్తు సంస్థల దాడులు, తదితర అంశాలు చర్చకు రానున్నట్లు వెల్లడించారు సంజయ్ రౌత్(Sanjay Raut).
బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలతో మీటింగ్ పెట్టాలని ముందుగా చొరవ తీసుకున్నది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటూ స్పష్టం చేశారు.
ఇందులో భాగంగా దీదీ అన్ని రాష్ట్రాల సీఎంలకు తానే స్వయంగా లేఖలు రాశారని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించాల్సిన అవసరం గురంచి ప్రత్యేకంగా మమతా బెనర్జీ ప్రస్తావించారని తెలిపారు.
ఇదిలా ఉండగా ఆమె రాసిన లేఖపై సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చర్చించినట్లు సంజయ్ రౌత్ వెల్లడించారు. మరో వైపు దేశంలో పలు చోట్ల జరుగుతున్న మత ఘర్షణలు, విద్వేష పూరితమైన ప్రసంగాలపై తప్పు పడుతూ దేశలోని 13 ప్రధాన పార్టీలకు చెందిన నేతల సంతకాలతో కూడిన ప్రకటన విడుదల చేయడం కలకలం రేపింది.
Also Read : టీఎంసీ విజయం బీజేపీకి గుణపాఠం