NVSS Prabhakar: త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు! రేవంత్ స్థానంలో కేసీఆర్ ?
త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు! రేవంత్ స్థానంలో కేసీఆర్ ?
తెలంగాణలో సీఎం మార్పు జరుగబోతున్నట్లు బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు డీల్ కుదిరిందని… తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమన్నారు. అంతేకాదు రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం కాబోతున్నారంటూ బాంబు పేల్చారు. ప్రస్తుతం ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
బుధవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ… జూన్ రెండో తేదీన లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం తథ్యం. బీఆర్‌ఎస్ విలీనం అవుతుంది. రాష్ట్రంలో సీఎం మార్పు ఖాయం. రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజీ డీల్ కుదిరింది. కేటీఆర్ నాయకత్వంలో కూడా పని చేస్తానన్న హరీశ్ రావు వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటూ కామెంట్స్ చేశారు. గతంలో కవితకు సాయం చేసిన న్యాయవాదిని చట్టసభకు పంపించడానికి బీఆర్ఎస్ ఎలా సహాయం చేసిందో అందరికీ తెలుసన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారా ఎంపిక జరగడం లేదన్నారు. దీనితో గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ కు చెందిన వారికే సంక్షేమ ఫలాలు జరుగుతున్నాయన్నారు. రాజకీయ నేపథ్యం లేని వారికి పథకాలు దక్కడం లేదన్నారు.
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందన్నారు. అనుకున్న లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో భారత్ సాధించిందన్నారు. ప్రపంచదేశాల్లో పాకిస్తాన్ ను ఏకాకిని చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కిందన్నారు. ఉగ్రవాదులపై కమ్యూనిస్టుల తీరు మారలేదని ఫైర్ అయ్యారు. వారి కౌన్సిల్ సమావేశాల్లో ఎప్పుడూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. తాము ఎదగాలని కాకుండా… బీజేపీని ఓడించాలని వారు ప్రయత్నిస్తారని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా దారుణంగా ఓటమి పాలవుతున్నా వారి బుద్ధి మారడం లేదన్నారు.
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మొయినాబాద్ వద్ద ప్రైవేటు భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్న కేసులో ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మొయినాబాద్ భూ వ్యవహారంలో గతంలో తెలంగాణ హైకోర్టు జీవన్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసి, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ సందర్భంగా… ఈ వ్యవహారంలో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరు చేశారని ఆయన తరఫు న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం దర్యాప్తునకు పూర్తిగా సహకరించాల్సిందనని స్పష్టం చేసింది. జస్టిస్ పార్థివాలా ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తుది ఉత్తర్వులు ఇచ్చింది. దర్యాప్తునకు సహకరించకపోతే విచారణాధికారులు తగిన చర్యలు తీసుకునే వెసులుబాటును సుప్రీంకోర్టు కల్పించింది.