OG Kush Drugs: హైదరాబాద్ లో కలకలం రేపుతున్న ఓజీ కుష్ డ్రగ్స్
హైదరాబాద్ లో కలకలం రేపుతున్న ఓజీ కుష్ డ్రగ్స్
OG Kush Drugs : హైదరాబాద్ మహానగరాన్ని డ్రగ్స్ మహామ్మారి వదిలిపెట్టడం లేదు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ… డ్రగ్స్ సరఫరా, వినియోగం మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓజీ కుష్ డ్రగ్స్ పట్టుబడటం… హైదరాబాద్ లో సంచలనంగా మారింది. హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.40 లక్షల విలువైన అరకేజీ ఓజి కుష్ డ్రగ్‌ను(OG Kush Drugs) స్వాధీనం చేసుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో పండించే ఓజీ కుష్ అనే డ్రగ్స్‌తో పాటు విదేశీ మద్యం బాటిళ్లను కూడా నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నాంపల్లి ఎక్సైజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి వెల్లడించారు.
OG Kush Drugs Viral on Hyderabad
ఈ సందర్భంగా జాయింట్ కమీషనర్ ఖురేషి మాట్లాడుతూ… ‘‘కాచిగూడ రైల్వే స్టేష్టన్ వద్ద బైక్‌పై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. స్కోడా కారులో మరో వ్యక్తి ఓజీ కుష్ డ్రగ్స్‌ను(OG Kush Drugs) మార్పిడి చేసుకునే సమయంలో ఎస్‌టీఎఫ్ ఎక్సైజ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కారులో తనిఖీలు చేయగా… 500 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్, కేజీ గంజాయి, 6 గ్రాముల చరస్, 4.38 గ్రాముల సింథటిక్ డ్రగ్స్‌తో పాటు 5 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నాం. ఇద్దరు నిందితులు ప్రతీష్ బట్, జైసూర్యలను అరెస్టు చేశాం’’ అని ఖురేషి తెలిపారు. నిందితుడు ప్రతీక్ బట్ ఓ సంస్థలో సూపర్ వైజర్ గా పని చేస్తూ మత్తుపదార్థాలు అమ్ముతున్నట్లు గుర్తించాము. గ్రాము ఓజి కుష్ డ్రగ్‌ను రూ. 3వేలకు విక్రయిస్తున్నట్లు మా ప్రాధమిక విచారణలో తేలింది. బుధవారం మధ్యాహ్నం జయసూర్యకు ప్రతీక్ డ్రగ్స్ అమ్ముతుండగా పట్టుకున్నట్లు చెప్పారు. పక్కా సమాచారం మేరకు వారిద్దరినీ అరెస్టు చేసినట్లు చెప్పారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సైతం ప్రతీక్ బట్ మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్టు కమిషనర్ ఖురేషి తెలిపారు. ఓజి కుష్ అనేది గంజాయి కంటే 25 శాతం ఎక్కువ మత్తు ఇస్తుందని పేర్కొన్నారు. ఇది విదేశాల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారని, గంజాయి లాగా దీన్ని పండించడానికి భూమి అవసరం లేదని చెప్పారు. భారతదేశంలో హిమాలయ పర్వతాల్లో ఓజి ఖుష్ పండించేందుకు అనుకూల వాతావరణం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ డ్రగ్ నీళ్లలోనే ఎక్కువగా పండుతుందని వెల్లడించారు. పట్టుకున్న ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు.
Also Read : Telangana Police: ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు నోటీసులు జారీ చేసిన తెలంగాణ పోలీసులు