Om Birla: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక !

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక !

Om Birla: 18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవి చేపట్టడం వరుసగా ఇది రెండోసారి కావడం విశేషం. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. సభాపతి పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. బుధవారం లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. సభాపతిగా ఓం బిర్లా(Om Birla) పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌తో పలువురు ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. అటు ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్‌ సావంత్‌ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు.

Om Birla As A 18th Lok Sabha Speaker..

అనంతరం మూజువాణీ విధానంలో ఓటింగ్‌ చేపట్టారు. ఇందులో ఓం బిర్లా(Om Birla) విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వెంట రాగా.. ఓం బిర్లా సభాపతి పీఠంపై ఆసీనులయ్యారు. ఆయనకు మోదీ, రాహుల్‌ సహా లోక్‌సభ సభ్యులు అభినందనలు తెలియజేశారు.

స్పీకర్‌ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తి ఓం బిర్లా. ఆయనకంటే ముందు ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్‌.ధిల్లాన్, బలరాం ఝాఖడ్‌, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాఖడ్‌ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. 61 ఏళ్ల ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్‌సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్‌ అయ్యారు.

Also Read : PM Narendra Modi: జులైలో ప్రధాని మోదీ రష్యా పర్యటన !

Leave A Reply

Your Email Id will not be published!