Omar Abdullah: ఎన్నికల్లో పోటీ అంశంపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా యూటర్న్ !
ఎన్నికల్లో పోటీ అంశంపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా యూటర్న్ !
Omar Abdullah: జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నతంకాలం తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని గతంలో ప్రకటించిన మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తన నిర్ణయం మార్చుకున్నారు. వచ్చే నెలలో జరగనున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. జమ్ముకశ్మీర్ మాజీ సీఎంగా పనిచేసిన ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉపాధ్యక్షులుగా ఉన్నారు. గాంధర్ బల్ నియోజకవర్గం నుంచి ఒమర్ అబ్దుల్లా పోటీచేస్తారని ఎన్సీ అధికారికంగా ప్రకటించింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ సయ్యద్ రుహుల్లా మోహదీ, ఆ పార్టీ ప్రావిన్షియల్ ప్రెసిడెంట్ నాసిర్ అస్లాం వనీ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఒమర్ అబ్దుల్లా ఆదివారం గాంధర్ బల్ జిల్లాలోని నునేర్ గ్రామంలో పర్యటించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందిన సయీమ్ ముస్తఫా ఒమర్ అబ్దుల్లా సమక్షంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా గాంధర్ బల్ శాసనసభ స్థానం నుంచి పోటీచేస్తారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. జమ్ముకశ్మీర్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా ఒమర్ అబ్దుల్లా ఎన్నికల్లో పోటీచేయడానికి సుముఖంగా లేరని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. తాను మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తానని చెప్పారు. జమ్ముకశ్మీర్ కు రాష్ట్ర హోదా దక్కిన తర్వాత తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, అప్పుడు తన కుమారుడు ఆ స్థానం నుంచి పోటీ చేస్తారన్నారు. తాజాగా ఒమర్ అబ్దుల్లా పోటీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. గాంధర్ బల్ నుంచి పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలో ఆయన పర్యటించి.. స్థానిక నాయకులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు.
Omar Abdullah – ఒమర్ అబ్దుల్లా ప్రస్థానం !
ఒమర్ అబ్దుల్లా 2009 నుండి 2015 వరకు జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు గాంధర్‌బల్, 2014 నుంచి 2019 వరకు బీర్వా అసెంబ్లీ స్థానాలకు ప్రాతినిధ్యం వహించారు. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో గాంధర్‌బల్ శాసనసభా స్థానం నుంచి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)కి చెందిన ఖాజీ మొహమ్మద్ అఫ్జల్ చేతిలో ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) ఓడిపోయారు.
మూడు దశల్లో పోలింగ్ !
జమ్ముకశ్మీర్‌లో మొత్తం మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొదటి దశకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి దశలో కశ్మీర్ లోయలో ఉన్న 24 అసెంబ్లీ స్థానాలకు, జమ్మూ డివిజన్లో సెప్టెంబర్ 18న పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 25న రెండో దశ, అక్టోబర్1న చివరి దశ పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. అక్టోబర్ 6వ తేదీకి పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది.
Also Read : Sandip Ghosh: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇంటిపై సీబీఐ దాడులు !