Parliament Security: 3300 మంది ‘సీఐఎస్‌ఎఫ్’ సిబ్బందితో పార్లమెంటుకు భద్రత !
3300 మంది ‘సీఐఎస్‌ఎఫ్’ సిబ్బందితో పార్లమెంటుకు భద్రత !
Parliament Security: లోక్ సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకోవడంతో… కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. దీనిలో భాగంగా పార్లమెంటు సమగ్ర భద్రత బాధ్యతలు ఇక పూర్తిస్థాయిలో ‘సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్’ కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. సీఐఎస్‌ఎఫ్ ఉగ్రవాద నిరోధక భద్రత విభాగానికి చెందిన 3300 మందికిపైగా సిబ్బంది సోమవారం (మే 20) నుంచి విధులు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు సీఆర్పీఎఫ్ కు చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్, ఢిల్లీ పోలీస్, పార్లమెంటు సెక్యూరిటీ స్టాఫ్ లు పార్లమెంటు భవన సముదాయంలో ఉమ్మడిగా ఈ బాధ్యతలు నిర్వహించాయి.
Parliament Security – అలజడి ఘటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు !
గతేడాది డిసెంబరులో శీతాకాల సమావేశాల సమయంలో పార్లమెంటు(Parliament)లో అలజడి ఘటన తీవ్ర కలకలం రేపడంతో స్థానికంగా భద్రతపై అనేక సందేహాలు తలెత్తాయి. దీనితో కాంప్లెక్స్‌లో సమగ్ర భద్రత బాధ్యతలను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే పాత భద్రతా సిబ్బంది స్థానంలో 3317 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని మోహరించనున్నారు. డీఐజీ ర్యాంకు స్థాయి సీఆర్పీఎఫ్ అధికారి శుక్రవారమే కాంప్లెక్స్‌లోని అన్ని సెక్యూరిటీ పాయింట్‌లను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సీఐఎస్‌ఎఫ్ కు ప్రత్యేకంగా శిక్షణ !
పార్లమెంటు కాంప్లెక్స్‌లోని అన్ని ప్రవేశ ద్వారాలు, అగ్నిమాపక విభాగం, సీసీటీవీ పర్యవేక్షణ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్ సెంటర్, జాగిలాల స్క్వాడ్, వాచ్ టవర్‌ల వద్ద సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని నియమించారు. ఇప్పటికే వారికి సంబంధిత శిక్షణ అందజేశారు. విధ్వంసక కార్యకలాపాల కట్టడి తదితర విధులకు ప్రత్యేకంగా శిక్షణ పొందినవారిని రంగంలోకి దించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో సిబ్బందిని మోహరించారని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తిస్థాయి అనుమతులు వస్తాయని వెల్లడించాయి.
గతేడాది డిసెంబరు 13న లోక్‌సభలో జీరో అవర్ జరుగుతుండగా… ఇద్దరు దుండగులు విజిటర్స్ గ్యాలరీలో నుంచి సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. అదే సమయంలో పార్లమెంట్ భవనం వెలుపల ఇద్దరు వ్యక్తులు స్మోక్ క్యానిస్టర్లతో ఆందోళన చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారందరినీ అదుపులోకి తీసుకున్నాయి. ఇదిలా ఉండగా.. దాదాపు 1.70 లక్షల మంది సిబ్బందితో కూడిన ‘సీఐఎస్‌ఎఫ్’.. కేంద్ర హోంశాఖ అధీనంలోని కేంద్ర సాయుధ పోలీసు దళం. ఢిల్లీలోని పలు కేంద్ర మంత్రిత్వ శాఖల భవనాలతోపాటు పౌర విమానాశ్రయాలు, అణుశక్తి, ఏరోస్పేస్ కేంద్రాలు, ఢిల్లీ మెట్రో వద్ద భద్రత కల్పిస్తోంది.
Also Read : Narendra Modi: అవినీతి పరులపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు !