PM Modi : రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) టోక్యోకు చేరుకున్నారు. ఆయనకు అక్కడ ఘన స్వాగతం పలికారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధాని క్వాడ్ సదస్సులో పాల్గొననున్నారు.
ఈ సందర్బంగా అక్కడికి చేరుకున్న మోదీ మీడియాతో మాట్లాడారు. భారత్, జపాన్ దేశాల మధ్య బంధం ఎప్పటి నుంచో పటిష్టంగా కొనసాగుతూ వస్తోందన్నారు. ఇరు దేశాలు ఒకేరకమైన ఆలోచనా ధోరణితో ఉన్నాయని తెలిపారు.
భారత్ లో భారీగా జపాన్ పెట్టుబడులు పెడుతోందన్నారు. ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నాయని చెప్పారు మోదీ. భారత దేశం ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుందని, ఆ దిశగా అడుగులు వేస్తుందన్నారు.
ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం ఒక పెద్ద ప్రయోజనానికి ఉపయోగ పడుతుందని మోదీ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఇరు దేశాలపై కొన్ని కొత్త బాధ్యతలు వచ్చి చేరాయని తెలిపారు.
ప్రపంచ ఉద్రిక్తతలు, ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, భద్రతకు విఘాతం కలిగించే సవాళ్లు, మానవ కేంద్రీకృత అభివృద్ది నమూనా అవసరాన్ని నొక్కి చెప్పాయన్నారు నరేంద్ర మోదీ.
జపాన్ తో బంధం బలీయమైనది. అంతకంటే ప్రత్యేకమైనది. వ్యూహాత్మకతతో కూడుకుని ఉన్నదని పేర్కొన్నారు మోదీ(PM Modi). భారత దేశం, యూఎస్ , జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ పలు కీలక అంశాలపై చర్చించనుందని తెలిపారు.
సభ్య దేశాలు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, నియమ ఆధారిత అంతర్జాతీయ విలువల్ని పంచుకుంటున్నాయని చెప్పారు మోదీ.
Also Read : మోదీకి జపాన్ చిన్నారుల గ్రీటింగ్స్