75 ఏళ్ల స్వతంత్ర భారతంలో పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వ నాశనం చేసిన చరిత్ర గత పాలకులదేనని నిప్పులు చెరిగారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. పనిగట్టుకుని వాటిని నిర్వీర్యం చేశాయంటూ ఆరోపించారు. గతంలో పార్టీలు గ్రామ ప్రజలను విభజించడంలో సక్సెస్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇవాళ ప్రజలు తమకు ఏమిస్తారనే దాని గురించి ఆలోచించే స్థాయికి దిగజార్చారంటూ మండిపడ్డారు.
కానీ తాము అధికారంలోకి వచ్చాక భ్రష్టు పట్టిన పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేశామని చెప్పారు నరేంద్ర మోదీ. ప్రస్తుతం దేశంలోని 2 లక్షలకు పైగా పంచాయతీలను ఆప్టికల్ ఫైబర్ తో అనుసంధానం చేశామని స్పష్టం చేశారు ప్రధానమంత్రి. గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు ఖర్చు చేయకుండా గత పాలకులు చేసిన అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీ అంతం చేసిందని ప్రధానమంత్రి చెప్పారు.
మధ్య ప్రదేశ్ లోని రేవాలో పంచాయతీ రాజ్ దివస్ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. గత ప్రభుత్వాలు గ్రామాలకు డబ్బులు ఇచ్చేవి కావు. అందుకే వాటిని పట్టించు కోవడం మానేశారన్నారు. చాలా పార్టీలు విభజించు పాలించు సూత్రాన్ని పాటిస్తున్నాయని ఆరోపించారు మోదీ.
ప్రస్తుతం టెక్నాలజీని అనుసంధానం చేయడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతున్నాయని తెలిపారు ప్రధానమంత్రి. ఇవాళ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర పనులు చాలా సులువుగా చేసుకునే వీలు కలుగుతోందన్నారు మోదీ.