PM Modi Start : అక్టోబర్ 2న ప్రధాని చేతుల మీదుగా రైల్వే పాంబన్ బ్రిడ్జి ఓపెనింగ్

1964లో పాంబన్‌ దీవిలో భారీ తుఫాన్‌ కారణంగా రైల్వే వంతెన బాగా దెబ్బతింది..

PM Modi : రామనాథపురం జిల్లా పాంబన్‌ వద్ద రూ.535 కోట్లతో నిర్మించిన రైల్వే వంతెన పనులు ఈ నెలాఖరులో పూర్తికానున్నాయి. దీంతో అక్టోబరు 2న ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) ఈ వంతెనను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో పాక్‌ జలసంధి ప్రాంతంలో పాంబన్‌ రైల్వే వంతెన ఉంది. రామేశ్వరం దీవిని భారత భూభాగంతో కలిపుతూ 1914లో ఆ రైల్వే వంతెన ప్రారంభించారు. రైల్వే వంతెన దిగువన పడవలు, నౌకలు సులువుగా వెళ్లేలా వంతెన మధ్యలో పట్టాలు ఇరువైపులా పైకి లేచే విధంగా హైడ్రాలిక్‌ లిఫ్ట్‌యంత్రాలు ఏర్పాటు చేశారు. 2.05 కి.మీల. పొడవైన ఈ రైల్వే వంతెన దేశంలోనే అతి పొడవైనదిగా పేరుగడించింది.

1964లో పాంబన్‌ దీవిలో భారీ తుఫాన్‌ కారణంగా రైల్వే వంతెన బాగా దెబ్బతింది. ఆ తర్వాత రైల్వే ఇంజనీరింగ్‌ సాంకేతిక నిపుణులు ఆ వంతెనకు మరమ్మతులు చేశారు. 1988లో పాంబన్‌ రైల్వే వంతెనకు చేరువగా పొడవైన రహదారి వంతెన నిర్మించారు. అప్పటివరకూ మండపం ప్రాంతానికి రామేశ్వరానికి రైల్వే వంతెనే ప్రధాన రహదారిగా ఉండేది. ప్రస్తుతం ఈ రైల్వే వంతెన 110 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో తరచూ స్థిరత్వాన్ని కోల్పోతున్నట్లు అధికారులు గమనించారు. రైల్వే వంతెనలో కొన్ని చోట్ల బీటలు వారాయి. ఈ పరిస్థితుల్లో పాత వంతెనకు పక్కనే కొత్తగా రైల్వే వంతెన నిర్మించేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తొలివిడతగా రూ.250 కోట్లు విడుదల చేసి, 2019 మార్చి ఒకటి ప్రధాన నరేంద్రమోదీ(PM Modi) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ఆగస్టు11న భూమి పూజతో పనులు ప్రారంభయ్యాయి.

PM Modi Will Inaugurate..

అప్పట్లో 2021 సెప్టెంబర్‌లోగా ఈ కొత్త రైల్వే వంతెన నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పాంబన్‌ సముద్ర ప్రాంతంలో తరచూ ఏర్పడే అలల ఉధృతి, తుఫాన్లు తదితర వాతావరణ మార్పులు, ఇవే కాకుండా కరోనా లాక్‌డౌన్‌ తోడవటంతో నిర్దేశిత కాలంలోగా రైల్వే వంతెన పనులు పూర్తికాలేదు. ప్రాజెక్టు ప్రణాళికా వ్యయం కూడా రూ.535 కోట్లకు పెరిగింది. రైల్‌ వికాస్‌ నిగమ్‌ సంస్థ ఈ రైల్వే వంతెన నిర్మాణ పనులు చేపట్టింది. అదే సమయంలో పాత పాంబన్‌ రైల్వే వంతెనలో నౌకలకు దారివిడిచే ప్రాంతం వద్ద లిఫ్ట్‌ యంత్రాల్లో సాంకేతిక లోసం ఏర్పడటంతో 2023 డిసెంబర్‌ నుంచి రామేశ్వరానికి రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. రామేశ్వరానికి వెళ్లే రైళ్లన్నింటినీ మండపం, రామనాఽథపురం వరకు మాత్రమే నడుపుతున్నారు.

కొత్తగా నిర్మించిన పాంబన్‌ రైల్వే వంతెన పొడవు 2.078 మీటర్లు. సముద్రంలో 333 కాంక్రీట్‌ పునాదులు నిర్మించారు. 101 స్తంభాలతో ఈ రైల్వే వంతెన నిర్మాణం త్వరలో పూర్తి కానుంది. ఈ కొత్త రైల్వేవంతెనపై ఒకే సారి రెండువైపులా రైళ్లు నడిచేలా డబల్‌ ట్రాక్‌ వేస్తున్నారు. ప్రస్తుతం పట్టాల ఏర్పాటు పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ రైల్వే వంతెన దిగువగా నౌకలు, పడవలు సులువుగా వెళ్లేందుకు వీలుగా వంతెన మధ్యలో 27 మీటర్ల ఎత్తుతో హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ యంత్రాలు కూడా అమర్చారు. ఈ రైల్వే వంతెనపై అక్టోబర్‌ 2 నుండి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని దక్షిణ రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఆర్‌ఎన్‌ సింగ్‌ ప్రకటించారు. కాగా అక్టోబర్‌ 2వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) ఈ రైల్వే వంతెనను ప్రారంభిస్తారని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ మేరకు అధికారికంగా ప్రకటన వెలువడాల్సి వుంది.

Also Read : MLA Kaushik Reddy : కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి మధ్య వేడెక్కుతున్న మాటల యుద్ధం

Leave A Reply

Your Email Id will not be published!