PM Narendra Modi: జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు !

జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు !

PM Narendra Modi: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడాలని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) పిలుపునిచ్చారు. ఏపీ మంత్రులు అవినీతి, అక్రమాల్లో ఒకరిని మించి మరొకరు పోటీపడుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరువేరు కాదని… ఈ రెండింటిని ఒకే కుటుంబం నడుపుతుందని ఆయన విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు సంయుక్తంగా చిలకలూరిపేటలో బొప్పూడిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా… రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 400కు పైగా ఎంపీ సీట్లు వచ్చేలా కృషి చేయాలని అప్పుడు వికసిత భారత్ తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమౌతుంది అని అన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ(PM Narendra Modi) మట్లాడుతూ… ‘‘ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు రెండు సంకల్పాలు తీసుకోవాలి. ఒకటి.. కేంద్రంలో ఎన్డీయే సర్కారును మూడోసారి స్థాపించటం, రెండోది… రాష్ట్రంలో అవినీతి వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడటం. ఐదేళ్లలో ఏపీ అభివృద్ధి కుంటుపడింది. దేశంతో పాటు, ఏపీ అభివృద్ధి కాంక్షించే వారంతా ముందుకొచ్చి ఎన్డీయేకు ఓటేయాలి. రాబోయే ఐదేళ్లు చాలా కీలకం. ఎన్డీయేతోనే రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ఈ పన్నాగాన్ని గుర్తించి ఎన్డీయేకు ఓటు వేయాలి’’ అని ప్రధాని పిలుపునిచ్చారు.

‘‘కోటప్ప కొండ దగ్గర బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం లభించినట్టు భావిస్తున్నా. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈసారి ఎన్నికల ఫలితాలు జూన్‌ 4న రాబోతున్నాయి. అంటే ఎన్డీయే కూటమికి 400 పైచిలుకు సీట్లు వస్తాయని సూచనలా కనిపిస్తోంది. ప్రాంతీయ భావాలతోపాటు, జాతీయ భావాలను కలుపుకొని కూటమి ముందుకెళ్తుంది. ఇందులో భాగస్వాముల సంఖ్య పెరిగితే మరింత బలం పెరుగుతుంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan) ఇద్దరూ చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి చేసిన కృషి, వారి పోరాటాన్ని గుర్తించాలి. ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలి. అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్‌ సాధ్యం’’ అని అన్నారు.

‘‘ఎన్డీయే సర్కారులో ప్రతిఒక్కరూ పేదల కోసం పనిచేస్తారు. ఆవాస్‌ యోజన కింద ఏపీలో 10 లక్షల ఇళ్లు ఇచ్చాం. జలజీవన్‌ మిషన్‌ కింద కోటి ఇళ్లకు తాగునీరు అందించాం. కిసాన్‌ సమ్మాన్‌ నిధితో పల్నాడు ప్రజలకు రూ.700 కోట్లు ఇచ్చాం. ఆయుష్మాన్‌ భారత్‌తో ఏపీలో 1.25 కోట్ల మందికి లబ్ధి జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చాం. విజయనగరం జిల్లాలో జాతీయ గిరిజన యూరివర్సిటీని ఏర్పాటు చేశాం. విశాఖలో ఐఐఎం, ఐఐఈ, తిరుపతిలో ఐఐటీ, ఐసర్‌, మంగళగిరిలో ఎయిమ్స్‌ నిర్మించాం. పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ యువత కోసం అనేక జాతీయ విద్యా సంస్థలు నెలకొల్పాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకే ఇవి స్థాపించాం. వచ్చే ఐదేళ్లూ డబుల్‌ ఇంజిన్‌ సర్కారుకే అవకాశం ఇవ్వండి. ఏపీలో నీలి విప్లవానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. మహిళలు, యువతకు కొత్త అవకాశాల సృష్టికి ప్రణాళికలు ఏర్పడుతాయి’’ అని మోదీ అన్నారు.

PM Narendra Modi – తెలుగులో ప్రధాని మోదీ స్పీచ్ !

ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) తన ప్రసంగాన్ని తెలుగులో మాట్లాడుతూ ప్రారంభించారు. ‘నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ ప్రారంభించారు. ఇదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావులను స్మరించుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. ఆయన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. రాముడి, కృష్ణుడు పాత్రలో జీవించేవారని.. అయోధ్యలో బాల రాముడి ప్రతిష్ట రోజు అదే గుర్తొచ్చిందన్నారు. రైతులు, పేదల కోసం ఎన్టీఆర్ పోరాడారని, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో నాణెం విడుదల చేశామని చెప్పారు. దివంగత నేత, మాజీ ప్రధాని పీవీ సేవలను గుర్తించి ఆయనకు భారతరత్న ఇచ్చామన్నారు. పీవీ నరసింహారావును కాంగ్రెస్ అవమానించిందని, ఎన్డీయే ప్రభుత్వం మాత్రం ఆయనను గౌరవించిందన్నారు.

Also Read : Electroral Bonds : ఎలక్టోరల్ బాండ్ల వివాదంపై స్పందించిన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి

Leave A Reply

Your Email Id will not be published!