ప్రజా కవి, యుద్ద నౌక గద్దర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ప్రజా కంఠక పాలన సాగుతోందని ఆరోపించారు. రాచరిక పాలన ఎంత కాలం సాగిస్తావంటూ ప్రశ్నించారు. చరిత్రలో ఎందరో కనుమరుగయ్యారని, కానీ ప్రజలే శాశ్వతమని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ కు అమర వీరుల ఉసురు తప్పక తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. గద్దర్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క చేసిన పాదయాత్రలో కవి , గాయకుడు గద్దర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా తన ఆట పాటలతో ఉర్రూతలూగించారు.
పేద ప్రజల భూములను సీఎం కేసీఆర్ అన్యాయంగా గుంజుకున్నాడని ఆరోపించారు. కోట్లకు పడగలు ఎత్తే కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారంటూ గద్దర్ ధ్వజమెత్తారు. రైతుల భూముల జోలికి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణలో భూమి పోరాటం మొదలైందని , ప్రజలు బీఆర్ఎస్, కేసీఆర్ కూల్చేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తే పుట్టగతులు ఉండవని అన్నారు గద్దర్.
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కార్ కే దక్కుతుందన్నారు కవి, గాయకుడు గద్దర్.
