భారతీయ జనతా పార్టీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు లపై తెలంగాణ రాష్ట్ర పోలీసుల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. వరంగల్ సీపీ రంగనాథ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని సూచించింది. బాధ్యత కలిగిన నాయకులై ఉండి ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. ఇక నుంచైనా తమ భాష తీరు మార్చుకోవాలని సూచించింది.
రాజకీయాలకు అతీతంగా పోలీసులు నిబద్ధతతో పని చేస్తున్నారని, వారి ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించాల్సింది పోయి దిగజార్చేలా కామెంట్స్ చేయడం తగదని స్పష్టం చేశారు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై. గోపిరెడ్డి. ఆయన తీవ్ర స్థాయిలో ఎంపీ బండి సంజయ్ , ఎమ్మెల్యే రఘునందన్ రావులను హెచ్చరించారు.
ఎలాంటి సెలవులు తీసుకోకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు రేయింబవళ్లు పోలీసులు శ్రమిస్తున్నారని, తాము ప్రజా ప్రతినిధులకు రక్షణ కవచంలా ఉన్నామని కానీ తమ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యత కలిగిన నాయకులకు తగదని పేర్కొన్నారు వై. గోపిరెడ్డి. సీపీ రంగనాథ్ పై వ్యక్తిగత దూషణలు చేయడం తమను బాధ కలిగించిందన్నారు. వెంటనే ఆ కామెంట్స్ ను ఉపసంహరించు కోవాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే న్యాయ స్థానాల్లో తేల్చుకోవాలని స్పష్టం చేశారు వై గోపిరెడ్డి. డీజీపీపై ఆటవిక భాషను ఉపయోగించడాన్ని ఖండిస్తున్నామన్నారు.