Pranay Murder Case: ప్రణయ్‌ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు

ప్రణయ్‌ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు

Pranay Murder Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ1 గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడి చనిపోగా… ఏ2గా ఉన్న నిందితుడు సుభాష్‌ కుమార్‌ శర్మ(Subhash Kumar)కు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవితఖైదు విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించింది. తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్‌ 14న సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య(Pranay Murder) చేయించాడు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీస్‌ యంత్రాంగం… విచారణ చేపట్టి ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీటు దాఖలు చేసింది. సుమారు ఐదేళ్ల 9 నెలల పాటు కోర్టులో విచారణ సాగగా… ఇటీవలే వాదనలు ముగిశాయి. తాజాగా నల్గొండ కోర్టు తుది తీర్పు వెలువరించింది.

ప్రణయ్‌ హత్య కేసు(Pranay Murder Case)లో ఏ1 నిందితుడు మారుతీరావు 2020లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఏ2 సుభాష్‌ కుమార్‌ శర్మ, ఏ3 అస్గర్‌ అలీ, ఏ4 బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్‌కుమార్, ఏ7 శివ, ఏ8 నిజాంలు మిగిలిన నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్‌ శర్మకు బెయిల్‌ రాకపోవడంతో జైలులోనే ఉండగా… అస్గర్‌ అలీ వేరే కేసులో జైలులో ఉన్నాడు. మిగిలిన వారందరూ బెయిల్‌పై బయటకు వచ్చారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని… తమపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లల కోసం శిక్ష తగ్గించాలని నిందితులు కోర్టును వేడుకున్నారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని అమృత బాబాయి శ్రవణ్‌ కుమార్‌(Sravan Kumar) అన్నారు. ముగ్గురు పెళ్లికాని పిల్లలు ఉన్నందున దయచూపాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.

Pranay Murder Case – ప్రణయ్‌-అమృత ప్రేమ వివాహానికి నో చెప్పిన అమృత తల్లిదండ్రులు

2018 జనవరిలో ప్రణయ్‌, అమృత ప్రేమ వివాహం చేసుకున్నారు. దీనితో రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో పోలీసులకు ఇరు కుటుంబాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ప్రణయ్‌ తోనే ఉంటానని పోలీసుల సమక్షంలో అమృత తేల్చిచెప్పింది. నిండు గర్భిణీగా ఉన్న అమృత వైద్య పరీక్షల నిమిత్తం భర్త ప్రణయ్‌, అత్త ప్రేమలతతో కలిసి 2018 సెప్టెంబర్‌ 14న ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా ప్రణయ్‌ ను దుండగుడు కత్తితో నరికి హత్యచేశాడు. దీనితో ఘటనాస్థలంలోనే ప్రణయ్‌ చనిపోయాడు. ఈ హత్య ఘటన దృశ్యాలు సీసీ కేమరాలో రికార్డు కావడంతో ఈ పరువు హత్య… తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ తీర్పుతో నేరస్థులకు కనువిప్పు కలగాలి: ప్రణయ్‌ తండ్రి

ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పు నేపథ్యంలో మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి వద్ద ఆయన తండ్రి బాలస్వామి, తల్లి ప్రేమలత పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం బాలస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ తీర్పుతో నేరస్థులకు కనువిప్పు కలగాలన్నారు. ‘‘ప్రణయ్‌ హత్యతో మేం చాలా కోల్పోయాం. ఇలాంటి హత్యలు జరగడం విచారకరం. ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలి’’ అని బాలస్వామి అన్నారు.

అమృత వల్లే ఇదంతా జరిగింది – సోదరి సంచలన వ్యాఖ్యలు

ప్రణయ్‌ హత్య ప్లాన్‌ అమలులో ఆరుగురు ప్రధాన సూత్రధారులని… అందులో తన బాబాయ్‌ శ్రవణ్‌ కీలకంగా వ్యవహరించారంటూ అమృత అప్పట్లో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల ఆధారంగానే దర్యాప్తు జరిపిన పోలీసులు… శ్రవణ్‌ ను ఏ6గా నిందితుల జాబితాలో చేర్చారు. అయితే సోమవారం వెల్లడించిన తీర్పులో ఆయనకు జీవిత ఖైదు పడగా… శ్రవణ్‌ కుటుంబం పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఏ తప్పు చేయకున్నా… తన తండ్రిని ఈ కేసులో ఇరికించారని శ్రవణ్‌ కూతురు మీడియా ముందు వాపోయింది. ఈ ఎపిసోడ్‌కు అమృతే కారణమంటూ ఆరోపించింది కూడా. ఈ క్రమంలో ఈ కేసులో తన తండ్రి ప్రమేయం లేదని చెబుతూ… ఆయన్ని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారామె.

Also Read : IT Raids: శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఐటీ అధికారుల సోదాలు

Leave A Reply

Your Email Id will not be published!