పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు జైలు శిక్ష విధించడంతో లోక్ సభ స్పీకర్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. ఈ సందర్భంగా గుజరాత్ కోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీకి బెయిల్ దొరికింది. ఇక కేరళ లోని వయనాడు లోక్ సభ నియోజకవర్గానికి ఏఐసీసీ మాజీ చీఫ్ ప్రాతినిధ్యం వహించారు నిన్నటి దాకా.
అనర్హత వేటు వేశాక తొలిసారి తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్బంగా కల్పేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యమేవ జయతే పేరుతో రోడ్ షో చేపట్టారు. భారీ ఎత్తున ప్రజలు ఆయనకు సాదర స్వాగతం పలికారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతిపక్ష కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. కల్పేట మొత్తం రహదారులన్నీ అభిమానులు, కార్యకర్తలతో నిండి పోయాయి. ఎక్కడ చూసినా రాహుల్ రాహుల్ అంటూ నినాదాలు చేశారు.
కేరళకు చెందిన పార్టీ సీనియర్ నాయకులతో కలిసి బహిరంగ వేదిక వద్దకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అభిమానులు సందడి చేశారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా అభివాదం చేశారు. అబద్దం నిలవదని సత్యం గెలుస్తుందన్నారు ఈ సందర్భంగా ఏఐసీసీ మాజీ చీఫ్.