Amaravati Farmers : అమరావతి రైతన్నలకు రాహుల్ భరోసా
పాదయాత్రలో పాల్గొంటానని హామీ
Amaravati Farmers : భారత్ జోడో యాత్ర చేపట్టిన కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీని అమరావతి రైతులు కలిశారు. మంగళవారం పాదయాత్ర ఏపీలోకి ప్రవేశించింది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. దారి పొడవునా పెద్ద ఎత్తున జనం ఆయన వెంట నడుస్తున్నారు.
ఈ సందర్భంగా కొద్ది సేపు అమరావతి నుంచి వచ్చిన రైతులతో(Amaravati Farmers) ముచ్చటించారు. తమకు జరిగిన అన్యాయం గురించి ఏకరవు పెట్టారు. ఆదుకోవాలని కోరారు. రాజధాని పేరుతో భూములు తీసుకున్నారని పరిహారం ఇవ్వడం లేదని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురి చేస్తోందంటూ తెలిపారు.
గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేస్తామని ప్రకటించిందని, కానీ ప్రస్తుతం కొలువు తీరిన వైసీపీ సర్కార్ మాత్రం కొత్త రాగం ఆలాపిస్తోందంటూ మండిపడ్డారు. ఏపీకి మూడు రాజధానులు చేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారని దీని వల్ల తమకు తీరని నష్టం ఏర్పడుతుందన్నారు.
ఆంధ్రా రైతులు ప్రస్తావించిన సమస్యలను సావధానంగా విన్నారు రాహుల్ గాంధీ. అమరావతి అభివృద్ది కోసం కేటాయించిన భూమికి తగు పరిహారం ఇచ్చేలా న్యాయ సహాయం చేస్తానని ఈ సందర్బంగా రాహుల్ గాంధీ రైతులకు హామీ ఇచ్చారు.
మరికొందరు నిర్వాసితులు పునరావాసం కోరుతున్నారని దీనిపై కూడా హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రలో తాను కూడా పాల్గొంటానని చెప్పారు రాహుల్ గాంధీ.
ఇదిలా ఉండగా తమకు రాహుల్ గాంధీ భరోసా ఇవ్వడంపై అమరావతి రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : అమరావతికి జై కొట్టిన రాహుల్ గాంధీ