Rahul Gandhi : కాంగ్రెస్ నేత పాండేకు రాహుల్ నివాళి
యాత్రలో పాల్గొన్న నేత మృతి
Rahul Gandhi : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగిసింది. కాగా మహారాష్ట్రలోకి ప్రవేశించిన యాత్రలో విషాదం చోటు చేసుకుంది. మరాఠా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్ పాండే గుండె పోటుతో మృతి చెందారు. ఆయన మృత దేహానికి రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నాయకులు నివాళులు అర్పించారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా వెల్లడించారు ఆపార్టీ మీడియా ఇంఛార్జి, ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్. ఇదిలా ఉండగా కృష్ణ కుమార్ పాండే రాహుల్ గాంధీ(Rahul Gandhi) వెంట యాత్రలో నడిచారు. కీలకమైన పాత్ర పోషించారు.
పాదయాత్రలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్ లో మంగళవారం యాత్రలో నడుస్తూ ఉండగానే పాండేకు గుండె పోటు వచ్చింది. ఆయనకు 75 ఏళ్లు. సేవా దళ్ కు నాయకత్వం వహిస్తున్నారు. కృష్ణ కుమార్ పాండే మరణం పార్టీకి ముఖ్యంగా సేవాదళ్ విభాగానికి తీరని లోటు అని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
ఇన్నేళ్ల వయస్సు ఉన్నప్పటికీ అత్యంత చురుకుగా పార్టీ కోసం ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన పాదయాత్రలో తనతో పాటు కలిసి నడవడాన్ని తాను ఇప్పటికీ మరిచి పోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .
పార్టీ పట్ల నిబద్దత, దేశం కోసం అంకిత భావం కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు, నాయకులకు స్పూర్తిగా నిలుస్తుందని ప్రశంసించారు రాహుల్ గాంధీ. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాండే మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
Also Read : కేరళ గవర్నర్ పై జర్నలిస్టుల కన్నెర్ర