Rahul Gandhi Modi : అగ్నిపథ్ మోసం జీఎస్టీ భారం – రాహుల్
హర్యానా భారత్ జోడో యాత్రలో ఆగ్రహం
Rahul Gandhi Modi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ దేశంలో మతం తప్ప ఇంకేదీ ముందుకు వెళ్లడం లేదన్నారు. అదొక్కడే దేశానికి అభివృద్దికి సంకేతంగా ప్రస్తుత సర్కార్ చెప్పే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ.
ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్తర ప్రదేశ్ లో ముగిసింది. శుక్రవారం హర్యానా రాష్ట్రంలో ప్రవేశించింది. పానిపట్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పాదయాత్రను ఉద్దేశించి ప్రసంగించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). కేంద్ర సర్కార్ తీసుకు వచ్చిన అగ్ని పథ్ , జీఎస్టీ దేశానికి శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నోట్ల రద్దు అనేది సామాన్యులను, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ఇదే సమయంలో బడా బాబులు, కార్పొరేట్స్ , వ్యాపారవేత్తలకు దేశానికి చెందిన విలువైన సంస్థలను అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నంలో ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. హర్యానా రాష్ట్రంలో నిరుద్యోగులు అన్నమో రామచంద్రా అంటున్నారని, దీనికి కారణం బీజేపీ ఖట్టర్ ప్రభుత్వమేనంటూ మండిపడ్డారు.
రైతులు, కూలీలు, చిన్న దుకాణాదారులు, నిరుద్యోగులు ఒక వైపున ఇబ్బందులు పడుతుంటే కేవలం 200 లేదా 300 మంది వ్యాపారవేత్తలు మాత్రం అన్ని సుఖాలు అనుభవిస్తున్నారంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ.
అగ్ని పథ్ స్కీం వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. ఇక జీఎస్టీ వల్ల వసూలవుతున్న డబ్బులు దేని కోసం, ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ.
Also Read : మానవత్వాన్ని మించిన మతం లేదు