Rajnath Singh: ఉగ్రవాదులకు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్‌ !

ఉగ్రవాదులకు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్‌ !

Rajnath Singh: మేము పొరుగుదేశాలతో ఎల్లప్పుడూ స్నేహమే కోరుకుంటుందని… అయితే అవతలివారు శాంతికి విఘాతం కలిగించాలని చూస్తే మాత్రం సహించబోమని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత్‌ హస్తం ఉందంటూ యూకే మీడియా రాసిన కథనంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) తీవ్రంగా స్పందించారు. దేశ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉగ్రవాదులను ప్రభుత్వం విడిచిపెట్టదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ… ఉగ్రవాదుల విషయంలో కేంద్రం వైఖరిని రాజనాథ్ స్పష్టం చేశారు.

Rajnath Singh Comment

‘‘దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాది అయినా ప్రయత్నిస్తే… తగిన సమాధానం చెప్తాం. ఒకవేళ వారు పాకిస్థాన్‌కు పారిపోయినా వదలం. అక్కడికి వెళ్లి మరీ మట్టుపెడతాం. ప్రధాని మోదీ చెప్పింది అక్షరాలా నిజం. భారత్‌ శక్తిని పాకిస్థాన్‌ అర్థం చేసుకోవడం ప్రారంభించింది. అలాగే భారత్ ఎప్పుడూ ఏ దేశంపై దాడి చేయదు. వారి భూభాగాలను ఆక్రమించేందుకు యత్నించదు. తన పొరుగుదేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటుంది. ఎవరైనా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం ఉపేక్షించదు’’ అని స్పష్టం చేశారు.

బ్రిటన్‌కు చెందిన ‘ది గార్డియన్‌’ పత్రిక భారత్‌ పై ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసింది. 2019లో పుల్వామా ఘటన తర్వాత నుంచి దేశానికి ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తులను న్యూఢిల్లీ లక్ష్యంగా చేసుకొందని పేర్కొంది. భారత విదేశీ ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘రా’ దాదాపు 20 హత్యలు చేసి ఉంటుందని ఆరోపించింది. భారత్‌, పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే కథనం రాసినట్లు పేర్కొంది. దీనిపై ఇప్పటికే మన విదేశాంగ శాఖ స్పందించింది. ఇది పూర్తిగా తప్పుడు సమాచారమని, భారత వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. ఇతర దేశాల్లో లక్షిత హత్యలు భారత్ ప్రభుత్వ విధానం కాదని పునరుద్ఘాటించింది.

Also Read : 2024 Elections: ఓటరు చైతన్యంపై పాట పాడిన ఎన్నికల అధికారి !

Leave A Reply

Your Email Id will not be published!