Rakesh Tikait : యువ‌త‌పై కేసులు ఎత్తేయండి – తికాయ‌త్

అగ్నిప‌థ్ స్కీంను వెన‌క్కి తీసుకోవాలి

Rakesh Tikait : ఈ దేశంలో ఏం జ‌రుగుతోందో అర్థం కావ‌డం లేదు. ఏ దేశానికైనా యువ‌త ప్ర‌ధానం. వారి శ‌క్తి యుక్తుల‌ను గుర్తించి వారిని స‌రైన దారిలో న‌డిపించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌పై ఉంటుంది.

దానిని ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వం విస్మ‌రించింది. వారిని సంఘ వ్య‌తిరేక శ‌క్తులుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డం మంచి పద్ద‌తి కాద‌న్నారు భార‌తీయ కిసాన్ యూనియ‌న్ అగ్ర నేత రాకేశ్ తికాయ‌త్(Rakesh Tikait).

గురువారం ఆయ‌న అగ్నిప‌థ్ స్కీంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శాంతియుతంగా నిర‌స‌న తెలిపే హ‌క్కు ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంద‌న్నారు. యువ‌కులు దేశ భ‌ద్ర‌త‌లో భాగం కావాల‌ని అనుకుంటున్నారు.

అందుకే ఆందోళ‌న బాట ప‌ట్టారు. కొంద‌రిని త‌మ ప్ర‌యోజ‌నాల కోసం రెచ్చగొడితే యువ‌కుల‌ను ఎలా బాధ్యులు చేస్తారంటూ ప్ర‌శ్నించారు రాకేశ్ తికాయ‌త్.

ఉపాధి దే ర‌క్ష‌ణ కోసం రిక్రూట్ మెంట్ కు సిద్ద‌మ‌వుతున్న యువ‌తపై కేసులు న‌మోదు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. వెంట‌నే వారిపై న‌మోదు చేసిన కేసుల‌ను ఎత్తి వేయాల‌ని తికాయ‌త్ డిమాండ్ చేశారు.

వారు దేశ ద్రోహులు కాద‌ని, వారు ఈ భ‌ర‌త‌మాత క‌న్న బిడ్డ‌ల‌ని మ‌రిచి పోతే ఎలా అని కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. దేశ వ్య‌తిరేకులంటూ కామెంట్స్ చేయ‌డం స‌బ‌బు కాద‌న్నారు.

ప్ర‌జా ప్ర‌తినిధుల ప‌ద‌వీ కాలం ఐదేళ్లు, ఆరేళ్లుగా నిర్ణ‌యించార‌ని కానీ దేశం కోసం జీవితాల‌ను త్యాగం చేసే జ‌వాన్ల‌కు నాలుగేళ్ల కాల ప‌రిమితి విధించ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ఇక‌నైనా కేంద్రం వెంట‌నే కేసులు ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు తికాయ‌త్.

Also Read : సోయం బాపురావుకు అరుదైన చాన్స్

Leave A Reply

Your Email Id will not be published!