Rakesh Tikait : మోదీ మోసం యుద్దానికి సిద్దం – టికాయత్
ఇచ్చిన హామీలను నెరవేర్చని సర్కార్
Rakesh Tikait : సాగు చట్టాలను రద్దు చేసి దేశానికి క్షమాపణలు చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులను నిట్ట నిలువునా మోసం చేశారంటూ నిప్పులు చెరిగారు సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేత రాకేశ్ టికాయత్(Rakesh Tikait). ఈ దేశంలో కార్పొరేట్లకు, బడా వ్యాపారవేత్తలకు ఊడిగం చేస్తూ పాలన సాగిస్తున్నారంటూ మండిపడ్డారు.
రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యూపీలోని లక్నోలో జరిగిన రైతుల ఆందోళనలో రాకేశ్ టికాయత్ పాల్గొన్నారు. రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం అన్నది తేలకుండా పోయిందని కార్పొరేట్లతో కూడిన పాలన సాగుతోందని ధ్వజమెత్తారు రైతు నేత.
దేశ వ్యాప్తంగా జరిగిన ఆందోనలు, నిరసనల్లో 5 లక్షల మందికి పైగా రైతులు పాల్గొన్నారని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర కల్పిస్తామని, పంట బీమా వర్తింప చేస్తామని, చని పోయిన రైతులను ఆదుకుంటామని, నష్ట పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చిన పాపాన పోలేదని మండిపడ్డారు.
దేశంలోని 25 రాష్ట్రాల రాజధానుల్లో లాంగ్ మార్చ్ లు, ర్యాలీలు చేపట్టడం జరిగిందన్నారు. బడా వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేలా విద్యుత్ సవరణ బిల్లు తీసుకు వచ్చారంటూ ఆరోపించారు రాకేశ్ టికాయత్(Rakesh Tikait). దేశ వ్యాప్తంగా రైతులపై నమోదు చేసిన కేసులను ఈరోజు వరకు ఉప సంహరించు కోలేదన్నారు.
ఇకనైనా మోదీ ప్రభుత్వం పునరాలోచించు కోవాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. లేక పోతే మరో రైతు పోరాటానికి ఉద్యమిస్తామని హెచ్చరించారు ఎస్కేఎం నేత రాకేశ్ టికాయత్.
Also Read : కాషాయం రాజ్యాంగానికి వ్యతిరేకం – రాహుల్