Raksha Khadse: కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు ! పోలీసులకు ఫిర్యాదు !
కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు ! పోలీసులకు ఫిర్యాదు !
Raksha Khadse : కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే(Raksha Khadse) కుమార్తె పోకిరీల నుండి వేధింపులు ఎదుర్కొన్నారు. ఇటీవల జల్‌గావ్ జిల్లాలో ముక్తాయ్‌నగర్ లో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన సంత్ ముక్తాయ్ యాత్రలో పాల్గొన్న తన కుమార్తెను కొందరు యువకులు వేధించారు. ఇదే విషయాన్ని ఆ యువతి తన తల్లి, కేంద్ర మంత్రి రక్షా ఖడ్సేకు తెలియజేయడంతో… కేంద్ర మంత్రి స్వయంగా వెళ్ళి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో మహిళల భద్రత పట్ల కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
Raksha Khadse….
పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే(Raksha Khadse) మాట్లాడుతూ… ‘‘మహాశివరాత్రి సందర్భంగా మా ప్రాంతంలో ఏటా సంత్ ముక్తాయ్ యాత్ర నిర్వహిస్తారు. ఇటీవల నిర్వహించిన స్నేహితులతో కలిసి ఆ యాత్రకు వెళ్తానని నా కుమార్తె కోరడంతో సెక్యూరిటీ సాయంతో అక్కడకు పంపించాను. ఆ సమయంలో కొందరు యువకులు వారిని వెంబడించి వేధించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైనా దురుసుగా ప్రవర్తించారు. గుజరాత్ పర్యటన నుంచి నేను ఇంటికి రాగానే మా అమ్మాయి ఈ విషయం చెప్పింది. ఓ ఎంపీ లేదా కేంద్ర మంత్రి కుమార్తెకే ఇటువంటి దుస్థితి ఎదురైతే… సాధారణ మహిళలు పరిస్థితి ఏంటో ఆర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశా’’ అని కేంద్ర మంత్రి ఖడ్సే మీడియాకు వెల్లడించారు.
ఇదే అంశంపై రక్షా ఖడ్సే మామ, మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే మాట్లాడుతూ… ‘‘ఈ యువకులపై గతంలోనూ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ అబ్బాయిలు కరుడుగట్టిన నేరస్థులు. మహారాష్ట్రలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. నేరస్థులు పోలీసులకు భయపడటం లేదు. బాధిత అమ్మాయిలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. వారి తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెల పేర్లు బయటకు రావద్దని భావిస్తున్నారు. మాకు ప్రత్యామ్నాయం లేకనే ఫిర్యాదు చేశాం’’ అన్నారు.
‘‘పోలీస్ స్టేషన్‌కు వెళితే రెండు గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారు. అమ్మాయిల విషయం కావడంతో పునరాలోచించుకోవాలని పోలీసులు మాకు చెప్పారు. యువకులు పోలీసులపైనా దాడి చేసిన సందర్భాలున్నాయి. వాళ్లు ఎంతగా తెగిస్తారో వీటిని బట్టి ఊహించుకోవచ్చు. వీళ్లకు రాజకీయ నాయకుల అండ ఉంది. ఇదే విషయంలో డీఎస్పీ, ఐజీతోనూ మాట్లాడాను’’ అని ఖడ్సే ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. నిందుతులు ఓ రాజకీయ పార్టీకి చెందినవాళ్లని, అందులో కొందర్ని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తాజా పరిణామంపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్దన్ సప్కాల్ మాట్లాడుతూ… మహాయుతి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు.
Also Read : Drunk and Drive: పోలీస్ స్టేషన్ పై నుండి దూకి మందుబాబు ఆత్మహత్యాయత్నం