Ram Temple Live at New York Time Square: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో అయోధ్య రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో అయోధ్య రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం
Ram Temple Live: భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. ఉత్తరప్రదేశ్ తో పాటు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. జనవరి 22న అయోధ్య(Ayodhya) భవ్య రామమందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, వేలాది మంది సాధువులు హాజరుకానున్నారు. దీనితో ఈ వేడుకను వీక్షించేందుకు కోట్లాది మంది భారతీయులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఆ కార్యక్రమాన్ని నేరుగా తిలకించేందుకు అందరికీ సాధ్యం కాదు కాబట్టి దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు భారతీయ ఎంబసీలు, కాన్సులేట్లలోనూ లైవ్ స్ట్రీమింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
Ram Temple Live – న్యూయార్క్ టైమ్స్ స్వేర్ లో లైవ్ స్ట్రీమింగ్ ?
అమెరికాలోని న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ లో కూడా ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రాణప్రతిష్ఠ పూర్తయిన అనంతరం భక్తులనుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. దీన్ని కూడా టైమ్స్ స్క్వేర్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ స్క్వేర్లో రామ మందిరాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి కాదు. 2020 ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ భూమిపూజ చేశారు. ఆ రోజున టైమ్స్ స్క్వేర్లో రామమందిర చిత్రాన్ని ప్రదర్శించారు.
84 సెకన్ల శుభ సమయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ !
బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఉత్సవానికి 84 సెకన్ల శుభ సమయం నిర్ణయించారు. 2024, జనవరి 22న ఉదయం 12:29 నుండి 12:30 మధ్య కాలంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. కాగా నూతన రామాలయం మూడు అంతస్తులలో నిర్మితమయ్యింది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. అయోధ్యలో(Ayodhya) ప్రతిష్ఠించబోయే రామ్ లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. ఈ విగ్రహం ఐదేళ్ల బాలుని రూపంలో ఉంటుంది. కాగా ఆలయంలో ఇంతవరకూ ఉన్న బాలరాముని విగ్రహాన్ని నూతన విగ్రహంతో పాటు గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు.
Also Read : Lagadapati Rajagopal : ఆ ఇద్దరు మాజీ ఎంపీలను కలిసిన లగడపాటి