UN Chief Guterres : భార‌త్ లో హ‌క్కుల ఉల్లంఘ‌న – గుటెర్రెస్

వైవిధ్యం గొప్ప‌త‌నం గ్యారెంటీ కాదు

UN Chief Guterres : భార‌త దేశంలో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు ఐక్య‌రాజ్య స‌మితి చీఫ్ గుటెర్రెస్. మానవ హ‌క్కుల మండ‌లిలో ఎన్నుకోబ‌డిన స‌భ్య దేశంగా భార‌త్ పై కీల‌క బాధ్య‌త ఉంద‌న్నారు.

ప్ర‌పంచ మాన‌వ హ‌క్కుల‌ను రూపొందించ‌డం, మైనార్టీ వ‌ర్గాల స‌భ్యుల‌తో స‌హా అన్ని ర‌కాల వ్య‌క్తుల హ‌క్కుల‌ను ర‌క్షించ‌డంపై ఫోక‌స్ పెట్టాల‌ని సూచించారు.

ఒక ర‌కంగా భార‌త్ ను యుఎన్ చీఫ్ హెచ్చ‌రించారు. భార‌త దేశంలో మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం గుటెర్రెస్ ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా బుధ‌వారం ముంబై వేదిక‌గా జ‌రిగిన స‌మావేశంలో ప్ర‌సంగించారు.

2014లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అధికారంలోకి వ‌చ్చాక మ‌త‌ప‌ర‌మైన మైనార్టీల‌కు వ్య‌తిరేకంగా హింస‌, ద్వేష పూరిత ప్ర‌సంగాలు ఎక్కువ గా ఉన్నాయ‌నే విష‌యం త‌న దృష్టికి వ‌చ్చింద‌న్నారు గుటెర్రెస్(UN Chief Guterres). ప్ర‌త్యేకంగా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే వారిపై, జ‌ర్న‌లిస్టుల‌పై కూడా దాడులు జ‌ర‌గ‌డం , కేసులు పెట్ట‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ప్ర‌ధానంగా మ‌హిళా జ‌ర్న‌లిస్టులు కొంద‌రు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు యుఎన్ చీఫ్‌. హ‌క్కుల‌ను రూపొందించ‌డ‌మే కాదు ర‌క్షించ‌డం కూడా భార‌త దేశంపై ఉంద‌ని గుర్తు చేశారు.

75 సంవ‌త్స‌రాల త‌ర్వాత భార‌త దేశం సాధించిన విజ‌యాల‌ను ప్ర‌శంసిస్తూనే వైవిధ్యం, గొప్ప‌తనం గ్యారెంటీ కాద‌ని విమ‌ర్శించారు గుటెర్రెస్. ఒక ర‌కంగా మోదీని హెచ్చ‌రించారు.

ద్వేష పూరిత ప్ర‌సంగాల‌ను ఖండించ‌డం ప్ర‌ధాన క‌ర్త‌వ్యం కావాల‌న్నారు. ప్ర‌పంచ వేదిక‌పై భార‌త దేశం త‌న స్వ‌రాన్ని వినిపించాలంటే ముందు త‌న దేశంలో ప్ర‌శ్నించే స్వ‌రాల‌కు స్వేచ్ఛ క‌ల్పించాల‌న్నారు.

Also Read : తాను ఏం చేస్తున్నానో ప్ర‌జ‌లు గ‌మ‌నించాలి

Leave A Reply

Your Email Id will not be published!