బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయన రాష్ట్రంలో కొలువు తీరిన కేసీఆర్ సర్కార్ ను ఏకి పారేశారు. దొర పాలనలో విశ్వ విద్యాలయాలు మూలన పడ్డాయని, పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఆరోపించారు. మహాత్మా గాంధీ యూనివర్శిటీని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
గతంలో తాను ఇక్కడికి వచ్చినప్పుడు వీసీ, యాజమాన్యం అడ్డుకుందన్నారు ఆర్ఎస్పీ. న్యాక్ వస్తుందని కలర్స్ వేశారని ఎద్దేవా చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతోనే యూనివర్శిటీ నడుస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు సీఎం ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. యూనివర్శిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇప్పటివరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు.
3 వేల మంది ప్రొఫెసర్లు ఉండాలని కానీ కేవలం 800 మంది మాత్రమే ఉన్నారని ఆవేదన చెందారు. ఇప్పటి వరకు కొలువు తీరిన సీఎం ఒక్క యూనివర్శిటీని కూడా సందర్శించిన పాపాన పోలేదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తాను అక్రమంగా సంపాదించినంత సొమ్మునంతా తన కూతురును రక్షించుకునేందుకు ఖర్చు చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.
వీసీలు పాలక వర్గానికి తొత్తులుగా మారారని, విద్యార్థుల సమస్యలను పట్టించు కోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే తానే ఎన్నికల ఖర్చు భరిస్తానని అంటున్నాడని ఇన్ని వేల కోట్లు ఎలా కేసీఆర్ కు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.