RS Praveen Kumar : కేసు తేలకుండానే పరీక్షలా – ఆర్ఎస్పీ
బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ కామెంట్స్
RS Praveen Kumar : బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రత్యేకించి పాలకుడిగా ఉన్న సీఎం కేసీఆర్ నిర్వాకం వల్లనే ఇవాళ పరీక్షల నిర్వహణ పూర్తిగా లోప భూయిష్టంగా మారిందని ఆరోపించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆర్ఎస్పీ స్పందించారు. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పెద్ద ఎత్తున పేపర్ లీకేజీ జరిగిందని తెలిసినా , సిట్ ఏర్పాటు చేసినా , దోషులు ఎవరో తెలిసినా ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ప్రశ్నించారు.
ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోందంటూ ఆరోపించారు. ఈ లీకేజీ కుంభకోణంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని, ఈ విషయం పూర్తిగా సీఎం కేసీఆర్ కు తెలుసని ధ్వజమెత్తారు. ఎక్కడైనా కేసు పూర్తయ్యాక పరీక్షలు చేపడతారని కానీ తెలంగాణలో పూర్తిగా భిన్నంగా ఉందని మండిపడ్డారు. బలవంతంగా పరీక్షలు ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర లక్ష్మిని, చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యులను ఎందుకు నిందితులుగా చేర్చలేదంటూ నిప్పులు చెరిగారు బీఎస్పీ చీఫ్. సీఎంబాధ్యతా రాహిత్యాన్ని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. వెంటనే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
లక్షలాది మంది నిరుద్యోగులు ఇవాళ రోడ్లపైకి వచ్చారని వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు ఆర్ఎస్పీ. పూర్తిగా పరీక్షలు రద్దు చేసి, బోర్డు చైర్మన్ , సభ్యులను తొలగించాలని డిమాండ్ చేశారు.
Also Read : CM Siddaramaiah : సీఎం సిద్దరామయ్య కామెంట్స్