Samatha Kumbh 2023 : దివ్య సాకేతంలో విష్ణు పారాయణం
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ సారథ్యంలో
Samatha Kumbh 2023 : శంషాబాద్ ముచ్చింతల్ లోని దివ్య సాకేతం మరోసారి భక్తుల సందోహంతో నిండి పోయింది. ప్రతి చోటా జై శ్రీమన్నారాయణ మూల మంత్రం వినిపిస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల దాకా , పామరుల నుంచి పండితుల దాకా అంతా భక్తిలో లీనమై పోయారు.
దివ్య సాకేత క్షేత్రంలో కొలువు తీరిన జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారి కరుణ కోసం వేచి చూస్తున్నారు. ఆయన చల్లని చూపు తమపై ప్రసరిస్తే చాలు అనే భక్తులు కూడా కొలువు తీరారు.
లోక కళ్యాణం కోసం ..సమస్త ప్రపంచం బాగుండాలనే సత్ సంకల్పంతో శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారు సమతా కుంభ్ 2023 ఉత్సవాలకు(Samatha Kumbh 2023) శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 2 నుంచి అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. యాగాలు, పూజలు, కైంకర్యాలు ప్రతి చోటా అగుపిస్తున్నాయి. భక్త బాంధవులు భగవత్ రామానుజుల అనుగ్రహం కలుగుతుందని నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం దివ్య సాకేతం ఓ నందనవనంలా మారిపోయింది.
ఇక ఉత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 9 గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 108 దివ్య దేశాల సమర్పణ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 5.00 నుంచి 5.45 శ్రీ విష్ణు సహస్ర పారాయణం నిరర్వహిస్తారు. 5 గంటలకు ప్రత్యేక వేదికపై సామూహిక ఉపనయన కార్యక్రమం ఉంటుంది. 6.00 నుంచి రాత్రి 8.30 గంటలకు గరుడ సేవలు ఉంటాయి. అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది.
10న శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక వేదికపై సామూహిక ఉపనయన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంటలకు గజ వాహన సేవ, 18 గరుడ సేవలు నిర్వహిస్తారు.
Also Read : బ్రహ్మోత్సవాలకు ‘మల్లన్న’ సిద్దం