కర్ణాటక ఎన్నికల ఫలితాలపై శివసేన (యుబిటి) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఆయన సంచలన కామెంట్స్ చేశారు. అన్నీ తానై వ్యవహరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా మసక బారిందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల పేరుతో చక్రం తిప్పుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి , ట్రబుల్ షూటర్ అమిత్ షా పాచికలు పారలేదని ఎద్దేవా చేశారు. సంజయ్ రౌత్ మరాఠాలో మీడియాతో మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభావం క్షీణిస్తోందని, ఇందుకు కర్ణాటకలో వెలువడిన ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రస్తుతం శివసేన కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్సీపీతో కలిసి పని చేస్తోంది. ఇప్పటి దాకా మిత్రపక్షంగా ఉంది. దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు సంయ్ రౌత్. ప్రస్తుతం ప్రజలు బీజేపీని కాకుండా విపక్షాల వైపు చూస్తున్నారని చెప్పారు. కర్ణాటకలో ఎన్ని కోట్లు కుమ్మరించినా ఒప్పుకోలేని, బీజేపీ ఛెంప ఛెళ్లుమనిపించారని పేర్కొన్నారు. ఎల్లకాలం తమ అధికారం ఉంటుందని అనుకోవడం భ్రమ అని ,ఇకనైనా మోదీ, షా కళ్లు తెరవాలని సూచించారు.
ప్రజాస్వామ్యం అంటే రాచరికం కాదని అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ఉంటుందని గుర్తించాలని స్పష్టం చేశారు సంజయ్ రౌత్. ఇది పూర్తిగా ప్రజలు అందించిన తీర్పును శిరసా వహించాల్సిందేనని పేర్కొన్నారు. ఏ ఒక్క పార్టీతో ఆధారపడకుండా విస్పష్టంగా మెజారిటీ ఇచ్చినందుకు తాను ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు రౌత్.