Sanjay Raut : ఈడీ సోదాలపై సంజయ్ రౌత్ ఫైర్
సీఎం ఉద్దవ్ కు సన్నిహితుడిగా పరబ్
Sanjay Raut : మనీ లాండరింగ్, భూ కబ్జాలకు సంబంధించిన కేసులో గురువారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మహారాష్ట్ర కేబినెట్ మంత్రి అనిల్ పరబ్ నివాసాలపై దాడులకు పాల్పడింది.
దాడుల అనంతరం ఎన్సీపీ మంత్రి అజిత్ పవార్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. కేంద్రం తన పరిమితుల్ని దాటి ప్రవర్తిస్తోందంటూ ధ్వజమెత్తారు.
ప్రధానంగా బిజేయేతర రాష్ట్రాలను టార్గెట్ చేసుకుందని, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందంటూ ఆరోపించారు. ఈడీ పూర్తిగా తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
ప్రస్తుతం మంత్రి అనిల్ పరబ్ నివాసంతో పాటు ఏడు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా గత ఏడాది అనిల్ దేశ్ ముఖ్ తో సంబంధం ఉన్న వివాదాల మధ్య సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ సచిన్ వాజ్ మంత్రి అనిల్ పరబ్ అవినీతిపై ఆరోపణలు చేశారు.
ఎన్ఐఏ కోర్టుకు రాసిన లేఖలో పరబ్ పేరు ప్రముఖంగా ప్రస్తావించడం కలకలం రేపింది. ఒక ప్రైవేట్ ట్రస్టు నుండి రూ. 50 కోట్లు దోపిడీ చేయాలంటూ తనను మంత్రి అనిల్ పరబ్ ఆదేశించాడని ఆరోపించారు సచిన్ వాజే.
కేంద్ర దర్యాప్తు సంస్థలకు శోధించేందుకు, దాడి చేసేందుకు హక్కు ఉంది. కాదనలేం కానీ రాష్ట్ర మంత్రిపై ఎందుకు ఈ చర్య తీసుకున్నారో తెలియదన్నారు అజిత్ పవార్.
తామంతా అనిల్ పరబ్ కు మద్దతుగా ఉన్నాం. విపక్షాలపై బీజేపీ కేంద్ర సర్కార్ సంస్థలను ప్రయోగిస్తోందంటూ సంజయ్ రౌత్(Sanjay Raut) సీరియస్ కామెంట్స్ చేశారు.
Also Read : ఢిల్లీ ఎల్జీగా కొలువుతీరిన సక్సేనా