Sanjay Roy: కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసు నిందితునికి ముగిసిన లై డిటెక్టర్ పరీక్ష !
కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసు నిందితునికి ముగిసిన లై డిటెక్టర్ పరీక్ష !
Sanjay Roy: కోల్ కతాలో ఆర్‌జీ కర్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలి దారుణ హత్యోదంతంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్(Sanjay Roy)కు ఆదివారం లై డిటెక్షన్ పరీక్ష నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. కోల్‌కతాలో ప్రెసిడెన్సీ కారాగారంలోనే పరీక్ష పూర్తిచేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ నుంచి పాలిగ్రఫీ నిపుణులు కోల్‌కతాకు వచ్చినట్లు తెలుస్తోంది.
మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు హతురాలితో పాటు పనిచేసే నలుగురు వైద్యులకు శనివారమే లై డిటెక్షన్ టెస్ట్ చేశారు. ఆ పరీక్షలో వాళ్లు ఏమేం చెప్పారనే వివరాలను పోలీసులు బయట పెట్టలేదు. సత్యశోధన పరీక్షలో వీళ్లు చెప్పిన అంశాలను సాక్ష్యాధారాలుగా కోర్టులో ప్రవేశపెట్టేందుకు చట్టపరంగా అనుమతి లేనప్పటికీ కేసు దర్యాప్తులో ఆ వివరాలు ఎంతో ఉపయోగపడతాయి.
Sanjay Roy – ఘోష్ ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు !
ఆర్‌జీ కర్ వైద్య కళాశాలకు ప్రిన్సిపల్ గా ఉండగా సందీప్ ఘోష్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ ఆదివారం ఆకస్మిక సోదాలు చేపట్టింది. ఉదయమే కేంద్ర బలగాలతో ఘోష్ ఇంటికి వెళ్లిన అధికారులు డోర్లు తెరవకపోవడంతో చాలాసేపు వేచి చూడాల్సి వచ్చింది. మాజీ మెడికల్ సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ వశిష్ట, మరో ప్రొఫెసర్, ఇంకో 12 మందికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేశారు. ఆస్పత్రికి ఔషధాలు, ఇతర ఉపకరణాలను సరఫరాచేసే వారి ఆఫీసుల్లోనూ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
Also Read : Ponguru Narayana: అమరావతిలో 4 మెగా పార్కులు – మంత్రి నారాయణ