Santhara: మధ్యప్రదేశ్‌ లో మూడేళ్ళ చిన్నారికి సంతారా (కారుణ్య మరణం)

మధ్యప్రదేశ్‌ లో మూడేళ్ళ చిన్నారికి సంతారా (కారుణ్య మరణం)

Santhara : మధ్యప్రదేశ్‌ కు చెందిన మూడేళ్ల చిన్నారి వియానా… జైన మత ఆచారం సంతారా(Santhara) (కారుణ్య మరణం) ప్రకారం ప్రపంచానికి వీడ్కోలు పలికింది. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న వియానాకు… ఆమె తల్లిదండ్రులు తమ మత ఆచారమైన సంతారాను ఎంచుకున్నారు. దీనితో ప్రపంచంలో అత్యంత పిన్న వయసులోనే ఈ ఆచారం ప్రకారం స్వచ్ఛందంగా మరణించిన వ్యక్తిగా ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో వియానా పేరు నమోదైంది. ఇంతకీ, వియానా మరణం కోసం ఆమె తల్లిదండ్రులు ఈ మార్గం ఎందుకు ఎంచుకున్నారు ? అసలు సంతారా(Santhara) అంటే ఏమిటి ?

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాకు చెందిన ఐటీ దంపతులు పీయూష్ జైన్ (35), వర్ష జైన్ (32)కు వియానా అనే మూడేళ్ళ బాలిక ఉంది. ఏడాది క్రితం వియానాకు మెదడులో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు ఇండోర్, ముంబైలలో ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స తర్వాత కోలుకున్నా ఈ ఏడాది మార్చిలో మళ్ళీ అనారోగ్యానికి గురైంది. మరల చికిత్స చేయించినప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. దీనితో పాప తల్లిదండ్రులు జైన్ ముని శ్రీ సలహా మేరకు ఆమెకు సంతార ఇప్పించారు. మతపరమైన ఈ ప్రక్రియ జరిగిన కొద్ది నిమిషాలకే వియానా మరణించింది. జీవితపు చివరి క్షణాల్లో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెకు తుది వీడ్కోలు పలికారు.

దీనితో ప్రపంచంలో అత్యంత పిన్న వయసులోనే ఈ ఆచారం ప్రకారం స్వచ్ఛందంగా మరణించిన వ్యక్తిగా ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో వియానా పేరు నమోదైంది. దీనితో జైన సమాజానికి చెందిన సంతారా(Santhara) ఆచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా వృద్ధాప్యంలో ఉన్నవారే స్వచ్ఛంద మరణం కోసం ఈ ఆచారాన్ని స్వీకరిస్తారు. తీవ్ర అనారోగ్య సమస్యలు తట్టుకోలేక చావు కోరుకునే వారు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే, బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న మూడేళ్ళ పాపకు సంతారా ఇప్పించడంపై అంతటా విమర్శలు చెలరేగుతున్నాయి.

మూడు సంవత్సరాల నాలుగు నెలల వయసున్న వియానా జైన్ ఈ ఆచారం స్వీకరించిన అతి పిన్నవయస్కురాలిగా నిలిచి అమెరికాకు చెందిన ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లో స్థానం సంపాదించింది. తల్లిదండ్రుల నిర్ణయాన్ని జైన సమాజం హర్షించి సత్కరించినా… దేశవ్యాప్తంగా డాక్టర్లు, పలువురు సామాజికవేత్తలు ఈ ఆచారాన్ని నిరసిస్తున్నారు. ఇంత చిన్న వయస్సులో సంతారాను ఇప్పించడం సరికాదని విమర్శిస్తున్నారు. మధ్యప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ సభ్యుడు ఓంకార్ సింగ్ మాట్లాడుతూ, ‘ఈ మతపరమైన ఆచారంపెద్దలకు మాత్రమే. ఆ తల్లిదండ్రుల పట్ల నాకు సానుభూతి ఉంది. కానీ, మరణశయ్యపై ఉన్నప్పటికీ అభం శుభం తెలియని చిన్నారికి ఇలా చేయకూడదు.’ అని అన్నారు.

Santhara – అసలు సంతారా అంటే ఏమిటి ?

సంతారా అనేది జైన ధర్మంలో ఒక పవిత్ర ఆచారం. దీనిని సల్లేఖన అని కూడా పిలుస్తారు. సంతారా ఆచారం ప్రకారం స్వచ్ఛందంగా చనిపోవాలనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తి ప్రాణం పోయేవరకూ ఆహారం, నీటిని ముట్టరు. ఆకలిని, దాహాన్ని ఆపడం ద్వారా ఆత్మ శుద్ధి చెంది చనిపోయాక శాంతి కలుగుతుందని జైనుల విశ్వాసం. సన్యాసం తీసుకున్నప్పుడు, చావుకు దగ్గరగా ఉన్నామని భావించేవారు సంతారా స్వీకరిస్తుంటారు. కఠినమైన ఈ పద్ధతి చట్టవిరుద్దమని, జైన మతానికి ఈ ఆచారం అవసరం లేదని 2015లో రాజస్థాన్ హైకోర్టు తీర్పు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ఆ తీర్పుపై స్టే విధించి దీనిని చట్టబద్ధం చేసింది. అలాంటి ఈ సంతారా ఆచారాన్ని… మూడేళ్ల పాపకు ఇప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : Fighter Jets: గంగా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఫైటర్ జెట్ లు ల్యాండింగ్, టేకాఫ్

Leave A Reply

Your Email Id will not be published!