Congress Rebels : ఎన్నిక‌ల రిజల్ట్స్ పై సీనియ‌ర్ల ఫోక‌స్

హై క‌మాండ్ పై స్వ‌రం పెంచే ఛాన్స్

Congress Rebels : దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు ముగిశాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్, గోవా, మ‌ణిపూర్ ల‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న ప‌ట్టు నిలుపుకుంది. ఇక ప‌వ‌ర్ లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది.

అక్క‌డ ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్ల‌తో అఖండ విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఒక ర‌కంగా చెప్పాలంటే చీపురుతో దుమ్ము దులిపింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ త‌రుణంలో ఇప్ప‌టికే అంప‌శ‌య్య‌పై ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్ప‌డు మ‌రో త‌ల‌నొప్పి వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. జీ -23 పేరుతో అస‌మ్మ‌తి నాయ‌కులు ఒక‌సారి స‌మావేశం అయ్యారు.

పార్టీపై తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. పార్టీలో ప్ర‌క్షాళ‌న అవ‌సర‌మ‌ని, నాయ‌కత్వ మార్పు ఉండాల‌ని బ‌హిరంగంగానే ప్ర‌శ్నించారు. నిల‌దీసినంత ప‌ని చేశారు కూడా. కానీ పార్టీ హైక‌మాండ్ (Congress Rebels)దాని నుంచి ఏమీ నేర్చుకోలేక పోయింది.

ఇప్ప‌టికే ఐదు రాష్ట్రాల‌లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన ప్రియాంక గాంధీ సార‌థ్యంలోని యూపీలో పార్టీ అడ్ర‌స్ లేకుండా పోయింది. క‌నీస ద‌రిదాపుల్లోకి రాలేక పోయింది.

ప్ర‌జ‌లు ఎందుకు పార్టీని న‌మ్మ‌డం లేద‌నే దానిపై ఇంత వ‌ర‌కు చ‌ర్చించ‌క పోవ‌డం దారుణ‌మ‌ని అంటున్నారు సీనియ‌ర్లు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం వేచి చూస్తున్న అస‌మ్మ‌తి నేత‌లు ఉన్న‌ట్టుండి మ‌రోసారి స‌మావేశం కానున్న‌ట్లు స‌మాచారం.

జీ -23 నాయ‌కుల‌లో గులాం న‌బీ ఆజాద్ తో పాటు మ‌నీష్ తివారీ ఉన్నారు. ఇదిలా ఉండ‌గా ఫ‌లితాల‌ను ఆత్మ ప‌రిశీల‌న చేసుకునేందుకు సోనియా గాంధీ స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు ఆ పార్టీ నాయ‌కుడు సుర్జేవాలా.

Also Read : సీఎంను ఓడించిన సామాన్యుడు

Leave A Reply

Your Email Id will not be published!