Brahmaputra Floods: ఈశాన్య రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు ! ‘డేంజర్’ లెవల్ లో బ్రహ్మపుత్ర !
ఈశాన్య రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు ! ‘డేంజర్’ లెవల్ లో బ్రహ్మపుత్ర !
Brahmaputra Floods : ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలోని అనేక జిల్లాల్లో అతలాకుతలం అవుతున్నాయి. దీనితో పలుచోట్ల బ్రహ్మపుత్ర నది ప్రమాదకర(Brahmaputra Floods) స్థాయిలో ప్రవహిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మణిపుర్ గవర్నర్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
Brahmaputra Floods Sensational
అస్సాంలోని 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 78వేల మంది తీవ్రంగా ప్రభావితమైనట్లు ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. దీనితో పలు చోట్ల రోడ్డు, రైలు, ఫెర్రీ సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. డిబ్రూగఢ్ జిల్లాలో బ్రహ్మపుత్ర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గువాహటిలో ఆదివారం కూడా ఎడతెరిపిలేని వర్షం కురిసింది. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ఎనిమిది మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
సిక్కింలోనూ రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగన్ జిల్లాలోని లాచెన్, లాచుంగ్ లోయ ప్రాంతాల్లో దాదాపు 1200లకుపైగా పర్యటకులు చిక్కుకుపోయినట్లు అంచనా. వర్షం తగ్గకపోవడం, తీస్తా నదిలో నీటిమట్టం పెరగడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతున్నట్లు సమాచారం.
మున్షితాంగ్ సమీపంలో మే 29న తీస్తా నదిలోకి ఓ వాహనం దూసుకెళ్లగా.. ఆ ఘటనలో ఎనిమిది మంది పర్యటకుల ఆచూకీ ఇంకా తెలియలేదు. దజోంగు నియోజకవర్గంలో కీలక మార్గంగా ఉన్న ఫిడాంగ్ బైలీ వంతెన అడుగుభాగం భారీ వరదలకు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. అదే ప్రాంతం ఎగువ భాగంలో కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలుచోట్ల కొంచడచరియలు విరిగిపడ్డాయి. సిగిన్ నది ఉప్పొంగి ప్రవహిస్తోండడం డజోరిజోలో ఆకస్మిక వరదలకు కారణమైంది. మణిపుర్‌లోనూ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత రెండు రోజుల్లోనే దాదాపు 900 ఇళ్లు దెబ్బతినట్లు అంచనా. ఖురియా, చెకొన్ సహా తూర్పు ఇంఫాల్‌లో అనేక ప్రాంతాలు ముంపునకు గురైనట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : Minister Nara Lokesh: వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహంపై మంత్రి లోకేశ్ ఆగ్రహం