కర్ణాటక మాజీ సీఎం , కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన సీఎం బస్వరాజ్ బొమ్మైని టార్గెట్ చేస్తూ వచ్చారు. కాగా ఇద్దరూ ప్రచారం సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో కలుసు కోవడం కెమెరా కంట పడింది. అది పక్కన పెడితే రాజకీయాలు బయట వరకు మాత్రమేనని తామిద్దరం మంచి స్నేహితులమని ఒకానొక సందర్భంలో స్పష్టం చేశారు సీఎం బస్వరాజ్ బొమ్మై.
ఈసారి కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠకు దారి తీశాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ సర్వ శక్తులు ప్రయోగించింది. ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటన చేశారు. ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తించారు. ఇక అమిత్ షా , జేపీ నడ్డా వ్యూహాలు పన్నడంలో మునిగి పోయారు. ఇక బొమ్మై మాత్రం చూస్తూ ఉండి పోయారన్న విమర్శలు ఉన్నాయి.
మే 10న 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మొత్తం 2,516 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈనెల 13న శనివారం ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో కాంగ్రెస్ పార్టీలో సంతోషం వ్యక్తం అవుతోంది. ఈ సందర్భంగా మాజీ సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడారు. ఇక సీఎంగా బొమ్మై పనై పోయిందని తాము అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు.
