Sonia Gandhi : మారిన స్వరం సోనియా ఆహ్వానం
భావ సారూప్యత కలిగిన పార్టీలకు పిలుపు
Sonia Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi) కీలక ప్రకటన చేశారు. త్వరలో దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆమె అన్ని పార్టీలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం భావ సారూప్యత కలిగిన వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు, పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు సోనియా గాంధీ. భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ నేతల అండతో పెరుగుతున్న ద్వేషం, హింసను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టించు కోవడం లేదని మాజీ చీఫ్ ఆరోపించారు.
ప్రజల గొంతుకను కాపాడు కోవడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్ ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ ఆరోపించారు. దీని వల్ల దేశ సంపద అంతా కొద్ది మంది చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇవాళ దేశంలో మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతాల పేరుతో విద్వేషాలు చెలరేగుతున్నాయని దీనికి కారణం ఎవరో ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి లౌకిక వాదంతో ముందుకు వెళుతోందని పేర్కొన్నారు సోనియా గాంధీ(Sonia Gandhi). పేరుకు మాత్రమే ప్రజాస్వామ్య ప్రభుత్వమని కానీ అంతా రాచరికమేనని ఆరోపించారు. నేరస్థులు, అక్రమార్కులు, దోపిడీదారులు, మోసగాళ్లకు అడ్డాగా మారడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : ఈడీ ముందుకు తేజస్వీ యాదవ్