Soumyanatha Swamy : సౌమ్యనాథ స్వామి ఉత్సవాలు షురూ
కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా పేరు
Soumyanatha Swamy : కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా పేరు పొందారు సౌమ్య నాథ స్వామి. ఈ దేవాలయం అన్నమయ్య జిల్లా నందలూరు పల్లెలో కొలువై ఉంది. 11వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన గుడి 10 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. ఏకంగా 108 స్తంభాలతో నిర్మించారు. ఈ గుడి కడప నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉండగా రాజంపేట నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆనాడు చోళ వంశ రాజు కులోత్తుంగ చోళుడు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నట్లు చరిత్రలో లిఖించారు.
సుప్రసిద్ద వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుడు సౌమ్యనాథ(Soumyanatha) దేవాలయాన్ని దర్శించి స్వామిపై శృంగార కీర్తనలు రచించినట్లు ఆధారాలున్నాయి. ఇదిలా ఉండగా ఈ గుడికి ఓ విశేషం కూడా ఉంది. గర్భ గుడిలో ఎలాంటి దీపం లేక పోయినా మూల విరాట్టు ఉదయం నుండి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగొందేలా ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం.
ప్రతి యేటా ఈ ఆలయంలో సౌమ్యనాథ స్వామి(Soumyanatha Swamy) బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). జూన్ 27న మంగళవారం నుండి వచ్చే నెల జూలై 7 వరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం స్వామికి అంకురార్పణ చేపడతారు. 28న ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం డోలోత్సవం, రాత్రి యాళీ వాహన సేవ, 29న ఉదయం స్నపన తిరుమంజనం, రాత్రి హంస వాహన సేవ నిర్వహిస్తారు.
30న శుక్రవారం ఉదయం పల్లకీ సేవ, రాత్రి సింహ వాహన సేవ, జూలై 1న శనివారం ఉదయం పల్లకీ ఉత్సవం, స్నపన తిరుమంజనం, రాత్రి హనుమధ్వాహన సేవ, 2న ఆదివారం ఉదయం శేష వాహనం, రాత్రి గరుడ వాహన సేవ చేపడతారు. 3న సోమవారం ఉదయం సూర్య ప్రభవాహనంలో స్వామి ఊరేగుతారు. రాత్రి చంద్ర ప్రభ వాహన సేవ, 4న మంగళవారం ఉదయం కళ్యాణోత్సవం, రాత్రి గజ వాహన సేవ, 5న బుధవారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహన సేవ, 6న గురువారం ఉదయం చక్ర స్నానం, ధ్వజారోహణం, రాత్రి మహా పూర్ణాహుతి నిర్వహిస్తారు.
Also Read : Etela Rajender : ఎప్పుడు పోతానా అని చూస్తున్నారు