తిరుమల : టీటీడీ, జిల్లా, పోలీసు యంత్రాంగాల సమన్వయం, అర్చక స్వాములు, అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తుల సమిష్టి కృషితో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు . తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భక్తులకు అందించిన సేవలను వివరించారు. అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు జరిగిన బ్రహ్మోత్సవాల్లో దేశవిదేశాల నుంచి విచ్చేసిన భక్తులకు వాహన సేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించామని చెప్పారు. గరుడ సేవ రోజున ఉదయం నుంచి భారీ వర్షం కురిసినా భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామి వారి సేవను వీక్షించారని, వారికి అల్పాహారం, అన్నప్రసాదాలు, బాదం పాలు, సుండలు, జ్యూస్, బిస్కెట్లు అందించామని చెప్పారు.
ఈ ఎనిమిది రోజుల ఉత్సవాలలో 6.46 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం చేసుకున్నారని తెలిపారు చైర్మన్. రూ.25.79 కోట్ల హుండీ కానుకలు, 22.60 లక్షల అన్నప్రసాదాల పంపిణీ చేయడం జరిగిందన్నారు. 2.44 లక్షల మంది భక్తుల తలనీలాల సమర్పించారని తెలిపారు. 34.34 లక్షల లడ్డూల విక్రయించినట్లు తెలిపారు. .గరుడసేవ రోజున చైర్మన్ తో కలసి పాలకమండలి సభ్యులు, ఉన్నతాధికారులు గ్యాలరీలు, క్యూలైన్లలో పర్యటించి భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. వాహనసేవలకు ముందు 26 రాష్ట్రాలు మరియు ఖతర్, దుబాయ్ నుంచి వచ్చిన 252 కళాబృందాలకు చెందిన సుమారు 6,777 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు. గరుడసేవ రోజున 17 రాష్ట్రాల నుంచి 31 కళాబృందాలకు చెందిన 863 మంది కళాకారులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనలిచ్చిన కళాబృందాలను ప్రతిరోజూ టీటీడీ ఈవో సన్మానించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా సుమారు 60 టన్నుల పుష్పాలు, 5 లక్షల కట్‌ఫ్లవర్స్, 80 వేల సీజనల్ పుష్పాలతో అలంకరణలు చేపట్టాం. తిరుమల, తిరుపతిలో విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేయడంతో పాటు వాహనసేవల వీక్షణకు 36 భారీ డిజిటల్ స్క్రీన్లు అందుబాటులో ఉంచామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించినట్లు తెలిపారు . ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు 13,608 ట్రిప్పుల్లో 4.01 లక్షల మంది, తిరుమల నుంచి తిరుపతికి 13,667 ట్రిప్పుల్లో 5 లక్షల మంది ప్రయాణించారు. తిరుమలలో 39 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురాగా, గత పది రోజుల్లో 6,900 ట్రిప్పుల ద్వారా సుమారు 7 లక్షల మంది భక్తులకు స్థానిక రవాణా సౌకర్యం కల్పించాం అన్నారు.
భక్తులకు సేవలందించేందుకు 4,500 మంది శ్రీవారి సేవకులు పాల్గొన్నారని, వైద్య సేవల కోసం 85 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్ సిబ్బంది, 20 అంబులెన్సులు, నాలుగు మొబైల్ క్లినిక్‌లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు టీటీడీ చైర్మన్. బ్రహ్మోత్సవాల్లో 2,800 మంది పోలీసులు, 2,000 మంది విజిలెన్స్ సిబ్బంది విధులు నిర్వహించగా, గరుడసేవ రోజున అదనంగా 1,000 మంది పోలీసులను ఏర్పాటు చేశాం. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాం అన్నారు. గరుడసేవ రోజున 3,500 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవలందించారు. సేకరించిన సుమారు 183 టన్నుల తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించారు.
