నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు స‌హ‌క‌రించండి

కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను కోరిన కిర‌ణ్ రిజిజు

న్యూఢిల్లీ : కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుపై చర్చలు జ‌రుగుతున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున్ ను కోరారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కీలక బిల్లులకు అడ్డు పడకూడదని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేర‌కు తాను ఖ‌ర్గేకు లేఖ రాశాన‌ని చెప్పారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని, భవిష్యత్తులో రాబోయే ముఖ్యమైన చట్టాల ఆమోదానికి అడ్డు పడకూడదని ఆయన ఆకాంక్షించారు. 16న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఖర్గే రాసిన లేఖకు సమాధానంగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడైన ఆయనకు రిజిజు ఈ లేఖ పంపారు.

డీలిమిటేషన్ సవరణ బిల్లును పరిశీలించి, ఆమోదించే ప్రక్రియలో ప్రభుత్వం నిరంతరం ప్రతిపక్షాల మద్దతును, సహకారాన్ని కోరుతూనే ఉందన్నారు కిర‌ణ్ రిజిజు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం పలుమార్లు సంప్రదించింది అని పేర్కొన్నారు. అయితే, పదేపదే కోరినప్పటికీ కాంగ్రెస్ పార్టీ చర్చల కోసం ఎటువంటి తేదీలను ఖరారు చేయలేద‌ని వాపోయారు. దీంతో ప్రభుత్వం ఇతర రాజకీయ పార్టీలను సంప్రదించాల్సి వచ్చింది అని ఆయన తెలిపారు. ప్రతిపాదిత చట్టానికి సంబంధించి విస్తృత ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు , చర్చలను సులభతరం చేసేందుకు డీఎంకే, ఎస్పీ, వైఎస్సార్సీపీ, ఎన్సీపీ, శివసేన (యూబీటీ), ఏఐఎంఐఎం, బీజేడీ వంటి పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపామని చెప్పారు రిజిజు . ప్రభుత్వం ఇప్పటికే చర్చల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, మళ్లీ మళ్లీ సంప్రదింపుల కోసం డిమాండ్ చేయడం ఎందుకో అర్థం కావడం లేదు అని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!