Suneetha Narreddy: అవినాష్‌ రెడ్డిపై సునీత సంచలన వ్యాఖ్యలు !

అవినాష్‌ రెడ్డిపై సునీత సంచలన వ్యాఖ్యలు !

Suneetha Narreddy: కడప రాజకీయాలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూ తిరుగుతున్నాయి. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగిన ఈ హత్యలో.. అప్పటి అధికార పార్టీ ప్రమేయం ఉందని భావించి వివేకా కుమార్తెతో పాటు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్… ఈ కేసుపై సీబీఐ విచారణ కోరారు. అంతేకాదు ఇది నారాసుర రక్త చరిత్ర అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి ఎన్నికల్లో రాజకీయ లబ్దిని పొందారు. అయితే జగన్ అధికారంలోనికి వచ్చిన తరువాత ఈ కేసును సీబీఐకు అవసరం లేదని చెప్పడంతో పాటు… ఐదేళ్ళలో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Suneetha Narreddy Comment

దీనితో వైఎస్ జగన్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సునీత సుప్రీకోర్టును ఆశ్రయించి చివరకు సీబీఐ విచారణకు అనుమతి సంపాదించింది. ఈ సీబీఐ విచారణలో ఈ హత్యతో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కరరెడ్డికు ప్రమేయం ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారించింది. అయితే అప్పటి నుండి అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా సీఎం జగన్ తన అధికారాన్ని ఉపయోగించి అడ్డుపడటంతో…. సునీతతో పాటు జగన్ సోదరి షర్మిల కూడా తమదైన శైలిలో ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసునే ఎజెండాగా తీసుకుని కడపలో కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి షర్మిల(YS Sharmila) సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం చేయాలంటూ సునీతా రెడ్డి… ‘జస్టిస్ ఫర్ వివేకా’ పేరుతో బషీర్ బాగ్ ప్రెస్‌ క్లబ్‌ లో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె… వివేకానంద రెడ్డి హత్య ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించారు. తనకు ఏ రాజకీయ పార్టీలతో సబంధం లేదని సునీత స్పష్టం చేశారు. తనకు కావాల్సిన న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని అన్నారు. అందులో భాగంగానే రాజకీయ పార్టీలు, బ్యూరో క్రాట్స్‌ని కలిశానని, కలుస్తానని స్పష్టం చేశారు. ఎవరి పని వాళ్ళు చేస్తే తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. తనకు ఫేవర్ చేయాలని కూడా తాను కోరుకోవడం లేదన్నారు. వివేక కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. అనంతరం 2009 వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను పూస గుచ్చినట్లు వివరించారు.

జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని అంతా తానై షర్మిల చూసుకుందన్నారు సునీత(Suneetha Narreddy). 3,000 కిలోమీటర్ల పాదయాత్రను జగన్ కోసమే షర్మిల(YS Sharmila) చేసిందని గుర్తు చేశారు. పార్టీ కోసం పనిచేసిన కుటుంబ సభ్యులు షర్మిల, వివేకాకు జగన్ అన్యాయం చేశారని ఆరోపించారు. జగన్ జైల్‌లో ఉన్న సమయంలో 2012 బై ఎలక్షన్లలో షర్మిల పోరాటంతోనే వైసీపీకి సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. షర్మిల(YS Sharmila) చరిష్మా చూసి అక్కసుతో ఆమెను దూరం పెట్టారని ఆరోపించారు.

2019 ఎలక్షన్‌ లో షర్మిలకు కడప లేదా వైజాగ్ నుండి సీటు ఇస్తారని భావించారన్నారు. కానీ, షర్మిలకు ఎలాంటి సీటును జగన్ కేటాయించలేదన్నారు. 2024 ఎన్నికల్లో అవినాష్ రెడ్డి ఓడిపోవాలి షర్మిల గెలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు సునీత. తమ కుటుంబంలో కడప ఎంపి సీట్ చాలా కీలకం అని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాక 2009 నుండి కుటుంబంలో విబేధాలు మొదలయ్యాయని అన్నారు. కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే సీట్లలో తమ కుటుంబం నుండే పోటీ చేశారని సునీత పేర్కొన్నారు. 2009 ముందు వరకు ఎంపీగా వివేకా, ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పోటీ చేస్తూ వచ్చారన్నారు.

సీబీఐ , కోర్టులలో న్యాయం జరగాలంటే ఆలస్యం అవుతుందని.. అందుకే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నానని చెప్పారు సునీత. అవినాష్ రెడ్డి లాంటి హంతకులు చట్టసభలకు వెళ్లొద్దు అన్నదే తన ధ్యేయం అని పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో సానుభూతి కోసమే వివేకానంద రెడ్డిని హత్య చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు సునీత. 2019 ఎన్నికల్లో అవినాష్ గెలుపు కోసమే వివేకా ప్రచారం చేశాడని.. కానీ అవినాష్ వాళ్ళు చంపాలనుకున్నారని సునీత ఆరోపించారు. ప్రతికారం తీర్చుకోవడం తన ధ్యేయం కాదన్నారు. అలా అనుకుంటే కడపకు వెళ్లి తానే నరికేసే దానిని అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

Also Read : Nimmagadda Ramesh Kumar: పింఛన్ల పంపిణీ ఆలస్యంపై నిమ్మగడ్డ రమేష్ కీలక వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!