Supreme Court : 16 మంది ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు వ‌ద్దు

జూలై 11 దాకా ఆప‌లంటూ సుప్రీం ఆదేశం

Supreme Court : మ‌హారాష్ట్ర రాజ‌కీయ సంక్షోభం ముదిరి పాకాన ప‌డింది. శివ‌సేన పార్టీకి చెందిన మంత్రి ఏక్ నాథ్ షిండే సార‌థ్యంలోని ఎమ్మెల్యేలు ధిక్కార స్వ‌రం వినిపించారు. వేరు కుంప‌టి పెట్టారు.

ప్ర‌స్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల‌తో క‌లిసి అస్సాం లోని గౌహ‌తి రాడిస‌న్ బ్లూ హోట‌ల్ లో కొలువు తీరారు. అక్క‌డి నుంచే రాజ‌కీయ తతంగాన్ని న‌డుపుతున్నారు.

దీంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ డిప్యూటీ స్పీక‌ర్ 16 మంది ఎమ్మెల్యేలు పార్టీ నియమ నిబంధ‌న‌లు ఉల్లంఘించారంటూ అన‌ర్హ‌త వేటు వేస్తూ నోటీసులు జారీ చేశారు.

ఇదిలా ఉండ‌గా ఏక్ నాథ్ షిండే సార‌థ్యంలోని ఎమ్మెల్యేల సంత‌కాల‌తో కూడిన లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్ కు, డిప్యూటీ స్పీక‌ర్ కు పంపించారు. త‌మ‌దే అస‌లైన శివ‌సేన పార్టీ అని, ఉద్ద‌వ్ ఠాక్రేది కాద‌ని పేర్కొన్నారు.

త‌మ‌కు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టాల‌ని విన్న‌వించారు. దీనిని ప‌క్క‌న పెట్టారు డిప్యూటీ స్పీక‌ర్.

దీంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో డిప్యూటీ స్పీక‌ర్ తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్ర‌యించారు.

ఏక్ నాథ్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేల‌పై డిప్యూటీ స్పీక‌ర్ ఇచ్చిన అన‌ర్హ‌త పిటిష‌న్ల‌పై జూలై 11 దాకా ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌వ‌ద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

జ‌స్టిస్ సూర్య‌కాంత్ , జ‌స్టిస్ ప‌ర్దివాలా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం వీరి పిటిష‌న్ల‌పై విచార‌ణ చేప‌ట్టింది. శివ‌సేన శాస‌న‌స‌భా ప‌క్ష నేత అజ‌య్ చౌద‌రితో పాటు డిప్యూటీ స్పీక‌ర్, కేంద్రానికి కూడా నోటీసులు జారీ చేసింది.

5 రోజుల్లో అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది.

Also Read : సంజ‌య్ రౌత్ కు ఈడీ స‌మ‌న్లు

Leave A Reply

Your Email Id will not be published!