Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల కేసులో రేవంత్ సర్కార్ కు షాకిచ్చిన సుప్రీంకోర్టు

కంచ గచ్చిబౌలి భూముల కేసులో రేవంత్ సర్కార్ కు షాకిచ్చిన సుప్రీంకోర్టు

Supreme Court : తెలంగాణా రాజకీయాల్లో సంచలనంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. సుమోటాగా కేసు స్వీకరించిన ధర్మాసనం… ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొదంటూ స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

Supreme Court of India Comment about Gachibowli Site

ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అత్యున్నత న్యాయస్థానం ప్రతివాదిగా చేర్చింది. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా, చెట్లు కొట్టే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా అని నిలదీసింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని జస్టిస్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని తెలిపింది. తమ ప్రశ్నలకు సీఎస్‌ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది. అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.

ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు(Telangana High Court) రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికను ఉన్నత న్యాయస్థానం పరిశీలించింది. అలాగే మీడియా, పత్రికల్లో వచ్చిన కథనాలను సైతం జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు అమికస్ క్యూరీ పరమేశ్వర్ ఉంచగా… వాటినీ పరిశీలించింది. కాగా, ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సుప్రీంకోర్టు(Supreme Court) ప్రతివాదిగా చేర్చింది.తెలంగాణ ప్రభుత్వం గత నెల 15న నియమించిన కమిటీలోని అధికారులు సైతం సమాధానం చెప్పాలని హుకుం జారీ చేసింది. ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన నివేదికలోని ఫొటోలు చూసి అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పింది. వందల కొద్దీ యంత్రాలు మోహరించాల్సిన అగత్యం ఏంటో అర్థం కావడం లేదని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు.

అయితే సుప్రీంకోర్టు తీర్పుపై హెచ్‌సీయూ(HCU) విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గో బ్యాక్ పోలీస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. భారీ వర్షంలోనూ నిరసనలు తెలుపుతున్నారు. విద్యార్థుల నినాదాలతో యూనివర్శిటీ ప్రాంగణం దద్దరిల్లుతోంది.

సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపదెబ్బ: రఘునందన్‌రావు

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో హెసీయూ విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రభుత్వ తీరుపై హెచ్‌సీయూ విద్యార్థుల పోరాట ఫలితంగానే కోర్టు తీర్పు వచ్చిందన్నారు. ‘‘యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం మేం కూడా పోరాడతాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలి. ప్రభుత్వ అనుమతి లేకుండా చెట్లు కొట్టవద్దని వాల్టా చట్టం చెబుతోంది. ఒక్క చెట్టు కొట్టడానికే అనుమతి అవసరమైతే… వందల చెట్లు ఎలా కొట్టారు? మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని అనుకున్న ప్రభుత్వానికి సుప్రీం తీర్పు చెంపదెబ్బ వంటిది’’ అని రఘునందన్‌ పేర్కొన్నారు.

Also Read : Lalu Prasad Yadav: ఎయిమ్స్‌ లో బీహార్ మాజీ సీఎం లాలూకు కొనసాగుతున్న చికిత్స

Leave A Reply

Your Email Id will not be published!