Tahsildar Murder: విశాఖలో తహసీల్దార్ దారుణ హత్య !
విశాఖలో తహసీల్దార్ దారుణ హత్య !
Tahsildar Murder: విశాఖలో దారుణం జరిగింది. మధురవాడలోని కొమ్మాదిలో ఇంటి సమీపంలోనే తహసీల్దార్ సనపల రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్ మెంట్ లో ఐదో అంతస్థులో నివాసం ఉంటున్న రమణయ్యను… శుక్రవారం రాత్రి పదిగంటల సమయంలో క్రిందకి పిలిచి ఇనుపరాడ్ తో దాడి చేసి చంపారు. ఈ దాడిలో రమణయ్య అక్కడిక్కడే కుప్పకూలిపోగా… వాచ్ మెన్ సమాచారంతో స్థానికులు వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. గతంలో విశాఖ రూరల్ (చినగదిలి) తహసీల్దార్ గా పనిచేసిన సనపల రమణయ్య ఎన్నికల నేపథ్యంలో ఇటీవల జరిగిన తహసీల్దార్ల బదిలీల్లో విజయనగరం(Vizianagaram) జిల్లాలోని బొండపల్లికి బదిలీ అయ్యారు.
శుక్రవారం బొండపల్లిలో బాధ్యతలు స్వీకరించి… కొమ్మాదిలోని తన ఇంటికి చేరుకున్నారు. ఇంతలో ఫోన్ రావడంతో ఐదో అంతస్థు నుండి క్రిందకి దిగి… ఆ వ్యక్తితో మాట్లాడారు. అయితే వారిద్దరి మధ్య మాట మాట పెరగడంతో… తాను తెచ్చిన ఇనుపరాడ్ తో ఆ వ్యక్తి దాడి చేసాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే రమణయ్య కుప్పకూలిపోయారు. గమనించిన వాచ్‌మెన్ కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తహసీల్దార్ రమణయ్య మృతి చెందాడు.
Tahsildar Murder – పోలీసుల అదుపులో నిందితులు ?
విశాఖలో సంచలనం రేపిన తహసీల్దార్(Tahsildar) రమణయ్య హత్యకేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. విశాఖపట్నం పోలీసు కమీషనర్ రవిశంకర్ అయ్యర్… ఘటనాస్థలాన్ని పరిశీలించి… సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఫోన్ రావడంతో కిందకు వచ్చి అపార్ట్‌మెంట్ గేట్ వద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైంది. దీనితో సీసీటీవి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే నలుగురు నిందితులను గుర్తించి… వారిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. భూ వివాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు ప్రాధమికంగా తెలుస్తోంది. గతంలో పద్మనాభం, చినగదిలి మండలాలతో పాటు కలెక్టర్ కార్యాలయంలో ఏఓ గా కూడా రమణయ్య పనిచేసారు. ఈ నేపథ్యంలో ఓ భూ వివాదానికి సంబంధించి ఈ హత్య జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు.
తహసీల్దార్ రమణయ్య హత్యతో రాష్ట్రంలో రెవిన్యూ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. రమణయ్య హత్యను ఖండిస్తూ ఇప్పటికే ఏపీ రెవిన్యూ అసోషియేషన్ పిలపుమేరకు 26 జిల్లాల్లోనూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నారు. హత్యకు పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. రెవిన్యూ అధికారులకు భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఏపీ రెవిన్యూ అసోషియేషన్ నాయకులు బొప్పరాజు, చేబ్రోలు కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
Also Read : MLC Kavitha : సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత