Tamil Nadu: నేడు తమిళ ఉగాది ! తమిళంలోనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్న జనం !

నేడు తమిళ ఉగాది ! తమిళంలోనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్న జనం !

Tamil Nadu : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న హిందీకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రజలు గళం ఎత్తుతున్నారు. ఈ నేపథ్యంలో వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు… తమ మాతృభాషలోనే చెప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్‌ 14 తమిళుల నూతన సంవత్సరం… తెలుగువారంతా ఉగాది జరుపుకున్న మాదిరిగానే తమిళులు నేడు వారి నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకుంటున్నారు. దీనిని వారు ‘పుతండు(Puthandu)’గా పిలుస్తుంటారు. నేడు తమిళ క్యాలెండర్‌ లోని చిత్తిరై నెలలోని మొదటి రోజు. ‘పుతండు’ రోజున తమిళనాడులో(Tamil Nadu) కుటుంబ సభ్యులంతా కలిసి ఉత్సవం చేసుకుంటారు. అలాగే రాష్ట్రంలోని వ్యాపారులు ఈ రోజున తమ నూతన ఆర్ధిక సంవత్సర లావాదేవీలను ప్రారంభిస్తారు. దీనిని “కై-విశేషం” అని పిలుస్తారు. కాగా తమిళనాట హిందీని వ్యతిరేకిస్తూ, సొంత భాషకు అత్యధిక ప్రాముఖ్యతనిస్తున్న తరుణంలో తమిళులంతా తమ భాషలోనే పరస్పరం ‘పుతండు’ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు.

Tamil Nadu Ugadhi

తమిళ పురాణాల ప్రకారం పుతండు రోజున బ్రహ్మదేవుడు విశ్వ సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. అలాగే ఈ రోజునే ఇంద్రుడు భూమిపైకి శాంతి, ఆశ, ఆనందాన్ని తీసుకువచ్చాడని భక్తులు విశ్వసిస్తారు. తమిళ సంస్కృతిలో ఈ రోజున కొత్త పనులు తలపెడితే శ్రేయస్సు, సంతోషం కలుగుతుందని చెబుతారు. పుతండును సంగమ యుగం నుంచి జరుపుకుంటున్నారని, ఇది వ్యవసాయ సంస్కృతితో ముడిపడి ఉందని చరిత్ర చెబుతోంది. పుతండు రోజున తమిళులు తమ ఇళ్లను కోలం (రంగోలీ)తో అలంకరిస్తారు. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి వేడుకలు చేసుకుంటారు. ‘మంగాయ్ పచ్చడి’ని తింటారు. దీనిని బెల్లం, మామిడి, వేప ఆకులు, ఎర్ర మిరపకాయలతో తయారుచేస్తారు. ఇది జీవితంలోని వివిధ రుచులను సూచిస్తుంది. ఈ రోజున ఆలయాలను సందర్శించడం, కొత్త బట్టలు ధరించడం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం చేస్తారు.

పుతండు ఉత్సవం తమిళులకు కేవలం కొత్త సంవత్సరం మాత్రమే కాదు, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే సమయంగా భావిస్తారు. పుతండు వేడుకలు సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడంతో పాటు, కుటుంబ బంధాలను బలోపేతం చేస్తాయి. ఈ ఉత్సవాన్ని శ్రీలంక, మలేషియా, సింగపూర్ తదితర తమిళ జనాభా అధికంగా కలిగిన దేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటారు. అయితే వారు తమ మాతృభాషలోనే పుతండు శుభాకాంక్షలు తెలుపుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read : Mehul Choksi: బెల్జియంలో మెహుల్‌ ఛోక్సీ అరెస్టు ! త్వరలో భారత్ కు అప్పగింత !

Leave A Reply

Your Email Id will not be published!