Sunil Kanugolu FIR : సునీల్ కనుగోలుపై కేసు నమోదు
తెలంగాణ గళం పేరుతో వ్యతిరేక ప్రచారం
Sunil Kanugolu FIR : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుపై(Sunil Kanugolu FIR) కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తెలంగాణ గళం పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పార్టీ చీఫ్ , సీఎం కేసీఆర్ , ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ , కూతురు ఎమ్మెల్సీ కవితలను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతూ వస్తున్నారని పేర్కొన్నారు.
ఈ పేజీలను సునీల్ కనుగోలు నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు. గత నెల నవంబర్ 24న సామ్రాట్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వెల్లడించారు. మాయా బజార్ సినిమాలోని ఓ వీడియోలో కేసీఆర్, కేటీఆర్, కవితల ఫేస్ లను మార్ఫింగ్ చేసి పోస్టు పెట్టారని తెలిపారు.
ఇందుకు సంబంధించి ఫిర్యాదు రావడంతో తాము ఆ పేజీని పూర్తిగా పరిశీలించడం జరిగిందని చెప్పారు. సామ్రాట్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మేరకు 41 -ఎ నోటీసులు ఇచ్చారు. ఈనెల 17న ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కాంగ్రెస్ వార్ రూమ్ లో పోలీసులు సోదాలు జరపడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే మాజీ ఎంపీ, మాజీ మంత్రి లను అరెస్ట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల దాడులను నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ మేరకు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామన్నారు.
Also Read : బెయిల్ పిటిషన్లను విచారించ వద్దు – రిజిజు