KTR : మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేవలం కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరాడని ఆరోపించారు.
తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరగబోయే ఈ ఉపఎన్నిక కేవలం ధన బలానికి స్థానిక ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు. ఇది పార్టీల మధ్య పోటీ కానే కాదని పేర్కొన్నారు కేటీఆర్(KTR). కేవలం డబ్బులు చూసుకుని మురిసి పోతున్న రాజగోపాల్ రెడ్డికి ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మునుగోడు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు తెచ్చుకుని కాషాయం తీర్థం పుచ్చుకున్నారంటూ ధ్వజమెత్తారు కేటీఆర్. అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
చండూరు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రజలు అభివృద్ది వైపు చూస్తున్నారని అందుకే తమ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలవడం ఖాయమన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని జోష్యం చెప్పారు మంత్రి కేటీ రామారావు(KTR).
నవంబర్ 3న జరిగే ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని అన్నారు.
Also Read : వరద బాధితులకు సీఎం భరోసా