Ashok Chavan : కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు – చౌహాన్
అదంతా అవాస్తవం దుష్ప్రచారం
Ashok Chavan : మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ చౌహాన్(Ashok Chavan) పార్టీని వీడుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై తీవ్రంగా స్పందించారు. ఇదంతా అబద్దమని, అవాస్తవమని స్పష్టం చేశారు.
పార్టీని వీడనున్నట్లు జరుగుతున్న ఊహాగానాలకు తెర దించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. తమిళనాడులోని కన్యాకుమారి నుండి ప్రారంభమైన ఈ యాత్ర తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ రాష్ట్రాలలో పూర్తి చేసుకుంది.
ఇప్పటి వరకు 1000 కిలోమీటర్లు పూర్తి చేశారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఆయన చేపట్టిన యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఇక్కడ పూర్తయిన వెంటనే నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించనుంది. ఇందు కోసం ఏర్పాట్లు చేయడంలో మునిగి పోయారు కాంగ్రెస్ పార్టీ నేతలు.
భారత్ జోడో యాత్ర కోసం పార్టీ ఆఫీసును ప్రారంభించేందుకు నానా పటోలే, బాలా సాహెబ్ థోరట్ , అశోక్ చవాన్(Ashok Chavan) నాందేడ్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా పార్టీని వీడనున్నారనే ఊహాగానాలను మహారాష్ట్ర కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ తోసిపుచ్చారు. ఇదంతా పూర్తిగా అబద్దమంటూ పేర్కొన్నారు.
ఇలాంటి ప్రశ్నలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని స్వయంగా ఆయనే స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పార్టీలో గందర గోళం సృష్టించేందుకే ఇలాంటి లీకులు, పుకార్లు సృష్టిస్తున్నారంటూ ధ్వజమెత్తారు ఆ పార్టీ మరాఠా చీఫ్ నానా పటోలే. పార్టీని బలోపేతం చేయడంలో అశోక్ చవాన్ పాత్ర కీలకమన్నారు బాలా సాహెబ్ థోరట్.
Also Read : కాలుష్య వ్యతిరేక ప్రచారంపై చెరో దారి