#GummadiVenkateswaraRao : తెలుగుద‌నానికి నిలువెత్తు రూపం గుమ్మ‌డి

Today is the death anniversary of the great Sri Gummadi Venkateswara Rao

గుమ్మడి. ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎస్వీ రంగారావు, చిత్తూరు నాగయ్య లాంటి నాటి అగ్ర శ్రేణి నటులతో నటించి ప్రత్యేక గుర్తింపు పొందిన గుమ్మడి వేంకటేశ్వర రావు తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక పేజీలు కలిగి ఉన్నారు. ప్రత్యేకపంచె కట్టు ఉత్తరీయం, సాంప్రదాయ దుస్తులతో అచ్చ తెలుగు వారిగా చిరస్థాయిగా నిలిచి పోయారు.

ప్రశాంత వదనంతో , చెరగని చిరునవ్వుతో , తెలుగు దనానికినిలువెత్తు చిరునామాగా కనిపించే మహామనిషి, శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు. అయిదు దశాబ్దాల పాటు తెలుగు చలన చిత్ర రంగంలో విభిన్న పాత్రలను పోషించి, తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వంచేత ‘రఘుపతి వెంకయ్య’ అవార్డును స్వీకరించారు. దాదాపుగా 500 లకు పైగా సినిమాలలో నటించారు.

తండ్రిగా , అన్నగా, మామగా, జమీందారుగా, పోలీసు అధికారిగా, ప్రతినాయకునిగా, సాంఘికపాత్రలు, జానపదాలలో రాజుగా మంత్రిగా రాజ గురువుగా విభిన్నపాత్రలు, పౌరాణికాలలో బలరామునిగా కర్ణుడిగా, దుర్యోథనునిగా, నటించి నాటి మేటి నటులు శ్రీ ఎన్. టి. రామారావు, శ్రీ నాగేశ్వరరావు, శ్రీ ఎస్, వి రంగారావు గార్లతో సమ ఉజ్జీగా ఉత్తమమైన నటన ప్రదర్శించి “శభాష్ ” అనిపించుకున్న నటుడు శ్రీ గుమ్మడి.

తెలుగు సినిమారంగంలో అతి చిన్న వయసులో అతి పెద్ద పాత్రలు ధరించి అలవోకగా ప్రేక్షకులను మెప్పించిన మహానటులు గుమ్మడి జులై 9 1927 న గుంటూరు జిల్లా తెనాలికి దగ్గరలోని “రావికంపాడు” గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో తల్లిదండ్రులకు మొదటి సంతానంగా జన్మించారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజులలోనే, ఉపాధ్యాయుని ఆదేశంతో పేదరైతు అనే నాటకంలో వయోవృద్ధుడైన రైతు పాత్రను పోషించారు. అదృష్ట దీపుడు ‘(1950) ద్వారా సినీ జీవితం ప్రారంభించారు. దానిలో గుమ్మడిగారి పాత్ర ముక్కామలకు అసిస్టెంట్. రెండవ సినిమా, నవ్వితే నవరత్నాలు. మూడవ సినిమా పేరంటాలు, నాలుగవ సినిమా ప్రతిజ్ఞ. వీటన్నిటిలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే లభించాయి. తర్వాత

తోడుదొంగలు’ (1954 ), ‘మహామంత్రి తిమ్మరుసు’ (1962) సినిమాలు గుమ్మడికి నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘తోడుదొంగలు’ కు రాష్ట్రపతి బహుమతి రాగా, ‘మహామంత్రి తిమ్మరుసు’ లో ఆయన నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా బహుమతి వచ్చింది. ‘మాయాబజార్’ (1957), మాయింటి మహాలక్ష్మి(1959), కులదైవం(1960), కులగోత్రాలు(1962), జ్యోతి(1977), నెలవంక(1981), మరోమలుపు(1982), ఏకలవ్య(1982), ఈ చరిత్ర ఏ సిరాతో(1982), గాజుబొమ్మలు(1983), పెళ్ళిపుస్తకం(1991) మంచి పేరు తెచ్చాయి.

సినీరంగంలో మృదుభాషిగా, సహృదయుడుగా పేరు తెచ్చుకున్న గుమ్మడి పుస్తక ప్రేమికుడు. సమయము దొరికినప్పుడు మంచి పుస్తకాలను చదివే రసజ్ఞుడు. గుమ్మడి అభిరుచిని గమనించి అయన రస హృదయానికి స్పందించి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ప్రఖ్యాతకవి, సి. నారాయణ రెడ్డి ఒక కావ్యమును అంకిత మివ్వడం సామాన్య విషయం కాదు .

గుమ్మడి వంటి మహానటుని 50సంవత్సరముల సుదీర్ఘ నటనారంగంలో సాధించిన ఘనతకు గుర్తింపుగా, తిమ్మరుసు పాత్రకు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు “కళాప్రపూర్ణ బిరుదుతోను, ఆంథ్రప్రదేశ్ ప్రభుత్వము వారు “రఘుపతి వెంకయ్య” అవార్డుతోను సత్కరించారు. ఆయన 3 సార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్ గాను, 2 సార్లు నంది అవార్డ్స్ కమిటి సభ్యులుగాను నియమించబడటం మరియే నటుడికి దక్కని గౌరవం అని చెప్పాలి

ఆయ‌న ఎందరో నటులను ప్రోత్సహించారు. కొన్ని చిత్రాలలో నటించినా, నిర్మాతల నుండి పారితోషికాలు తీసుకోలేదని చెపుతారు. అజాత శతృవు, స్నేహ పిపాసి, పుస్తక పఠ నాభి లాషి, మానవత్వం పరిమళించే మూర్తి, ప్రతిభ ఎవరిలో ఉన్నా, గుర్తించి ప్రోత్సహించిన మహానటుడు శ్రీ గుమ్మడి 26 జనవరి 2010 న కన్ను మూశారు.

No comment allowed please