#SPBalasubramanyam : బాలూ గాత్రం దేవుడిచ్చిన వ‌రం

నువ్వు లేవు నీ పాట మిగిలే వుంది

SP Balasubramanyam : పాటై..ప్ర‌వాహ‌మై..న‌లుదిక్కులా ప్ర‌వ‌హించిన వాడు. గుండె గుండెకు ఆత్మీయ వార‌ధిని పాట‌ల‌తో నిర్మించిన వాడు. అద్భుతం..అజ‌రామ‌రం ఆయ‌న గాత్రం. ఒక‌టా రెండా వంద‌లా కాదు వేన‌వేల పాట‌లు ప్ర‌తి చోటా ప్ర‌తి నోటా వినిపిస్తూనే ఉన్నాయి..కాలం ఉన్నంత దాకా..ఈ ఊపిరి పీల్చుకునేంత దాకా..ఈ లోకం ఉన్నంత దాకా..ఆ సూర్య‌చంద్రులు వెలుగుతున్నంత దాకా శ్రీ పండితారాధ్యుల బాల సుబ్ర‌మణ్యం గుర్తుండి పోతారు..చిర‌కాలం త‌న స్వ‌ర విన్యాసంతో అల్లుకుపోతారు..వ్య‌క్తి నుంచి ప్రారంభ‌మై వ్య‌వ‌స్థ‌గా విడ‌దీయ‌లేని..విస్మ‌రించ‌లేనంత‌గా త‌న స్వ‌రంతో అజ‌రామ‌ర‌మైన సంత‌కాన్ని ఇక్క‌డ వ‌దిలేసి పోయాడు.

బాలూ(SP Balasubramanyam)…ఇక చాలు..నువ్వు సాధించిన విజ‌యం అద్భుతం..ఇంకెందుకు ఉంటావు..అలుపు సొలుపు లేకుండా ఇలాగే ఉంటే ..ఇంక మా కోసం ఎవ‌రు పాడుతారంటూ..ఆ దైవం బాలుని స్వ‌ర్గానికి తీసుకు వెళ్లింది. కోట్లాది మందికి గాత్రంలో ఉన్న మాధుర్యాన్ని .. ఆ స్వ‌రంలోని తీయ‌ద‌నాన్ని..మాతృత్వపు లోని మ‌ధురాన్ని..పంచారు..పంచుతూనే వ‌చ్చారు. ఇంజ‌నీర్ కావాల‌నుకుని అనుకోకుండా గాయ‌కుడిగా మారిన బాల‌సుబ్ర‌మణ్యం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అమృతం ఉందో తెలియ‌దు..కానీ ప‌ది కాలాల పాటు దాచుకోద‌గిన ఆణిముత్యాల‌ను అందించారు. ప్ర‌పంచ‌మంత‌టా తెలుగు వారి లోగిళ్ల‌లో పాట‌ల ముగ్గులేసి..మాట‌ల తోర‌ణాలు తొడిగి..బ‌తుకంతా పాట లాగా సాగాలి అంటూ నిరంత‌రం త‌లుచుకునేలా చేశాడు.

1965లో శ్రీ‌శ్రీ‌శ్రీ మ‌ర్యాద రామ‌న్న సినిమితా ప్రారంభ‌మైన ఆయ‌న కెరీర్ అనూహ్యంగా ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొంటూనే స‌మున్న‌త స్థానాన్ని చేరుకుంది. వ్య‌క్తిగా ఆయ‌న అంద‌రికి సుప‌రిచితుడు..కానీ గాయ‌కుడిగా ఆయ‌న సాధించిన విజ‌యం అపురూపం. కొంద‌రు కొన్ని మాత్ర‌మే పాడ‌గ‌ల‌రు..కానీ ఆయ‌న అంద‌రికి అన్ని వేళ‌ల్లో ..అన్ని కాలాల్లో పాడ‌గ‌ల‌రు..మ‌న‌ల్ని మెప్పించగ‌ల‌రు. వ్య‌క్తి నుంచి ప్రారంభ‌మై వ్య‌వ‌స్థ‌గా తిరుగులేని శ‌క్తిగా ఎదిగిన తీరు ఎంద‌రికో ఆద‌ర్శం..అనుస‌ర‌ణీయం కూడా. తెలుగు భాష ప‌ట్ల ఆయ‌న‌కున్న మ‌క్కువ‌..నిండైన రూపం..ఒద్దిక‌గా..ఒదిగిపోయే మంచి మ‌న‌స్సు క‌లిగిన మ‌హ‌నీయుడు..చిర‌స్మ‌ర‌ణీయుడు ఆయ‌న‌. దేశంలో ఎంద‌రో గాయ‌నీ గాయ‌కులున్నారు. కానీ బాలు మాత్రం ఒక్క‌డే.

ఆయ‌న సాధించిన ఫీట్ సామాన్య‌మైన‌దా కాదు అస‌మాన్య‌మైన‌ది..ఎవ‌రూ చేరుకోలేనిది. మేరు ప‌ర్వ‌మ‌త‌మంత ఎత్తుకు ఎదిగిన వాడు. జీవితం వేరు జీవించ‌డం వేరు..పాట‌కు ప్రాణం పోసిన వాడు..పాటే ప్రాణ‌ప‌దంగా చేసుకున్న వాడు..పాట‌ల ప్ర‌పంచానికి సొబ‌గులు అద్దిన వాడు..పాటే జీవిత‌మ‌ని..బతుకే పాటంటూ పాడుకునేలా చేసిన వాడు..తానే పాటైన వాడు..పాట లేకుండా త‌ను లేడు..అత‌ను లేకుండా మ‌నం మామూలుగా ఉండ‌లేం. అంత‌లా మ‌న‌తో క‌లిసి పోయాడు..మ‌న ఇంట్లో మ‌నిషై పోయాడు. మ‌న‌తో పాటే ఉన్నాడు..ఉంటాడు..మ‌నం ఉన్నంత దాకా..కాలం ప‌ల‌క‌రించే దాకా..దిగంతాల‌న్నీ ఇపుడు బాలు స్వ‌ర మాధుర్యాన్ని ..ఆ గొంతులోని లాలిత్యాన్ని ..మార్ద‌వాన్ని ..మాధుర్యాన్ని..చూసి ఆశ్చ‌ర్యానికి లోన‌వుతున్నాయి.

ఆయ‌న మాట్లాడితే పాట‌వుతుంది..అది మ‌న‌ల్ని క‌ట్టిప‌డేస్తుంది..గుండెల్ని పిండేస్తుంది. బాలు పాట‌ల క‌ల‌బోత‌..మాట‌ల మాంత్రికుడు..విన‌య విధేయుడు. విశాల హృద‌యాన్ని క‌లిగిన అరుదైన మాన‌వుడు..జ‌గమంతటిని స్వ‌ర సంచారంతో దీపాల వెలుగుల్ని ..పాట‌లనే ప‌ల్ల‌కీల‌ను మోసేలా చేసిన వాడు..బాలు ఓ లెజెండ్..కాద‌న‌లేం..ఎందుకంటే అంత‌లా ఆయ‌న ఎవ‌రూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు గ‌నుక‌. ప్ర‌తి ఒక్క‌రిలో ఏదో ఒక ప్ర‌తిభ ఉంటుంది..కానీ బాలు స‌ర్ వెరీ వెరీ స్పెష‌ల్..ఆయ‌న పేరు త‌లుచుకుంటే చాలు..అమృతం నిండిన ఆ స్వ‌రం మ‌న‌ల్ని జోల పాడేలా చేస్తుంది. ఆ గొంతు లోంచి ఏ ఒక్క మాట జారినా అది పాట‌గా మారి..మ‌న‌ల్ని మ‌నుషుల్ని చేస్తుంది. లాలిత్యం..స్వ‌ర విన్యాసం క‌లిస్తే బాలు.

ఎలాంటి సంగీత ప‌రిజ్ఞానం లేకుండానే శంక‌రా నాద శ‌రీరా ప‌రా అంటూ దేశాన్ని..ప్ర‌పంచాన్ని ఎవ‌రిదీ ఈ గొంతు అంటూ ఆశ్చ‌ర్య పోయేలా చేశాడు. అదీ ఆయ‌నలోని గొప్ప‌దనం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడూ త‌న మూలాల‌ను మ‌రిచి పోలేని అత్య‌ద్భుత‌మైన గాయ‌కుడు. బాలు (SP Balasubramanyam) మ‌న‌తో పాటే ఉంటారు..మ‌న‌తో పాటే ప్ర‌యాణం చేస్తారు. మ‌న వెన్నంటి న‌డుస్తారు. మ‌న‌కు శ‌క్తినిస్తారు..పాట‌ల‌తో సేద దీరేలా చేస్తారు. ప్రాతః స్మ‌ర‌ణీయుడై మ‌న‌ల్ని మేల్కొల్పుతాడు. గుండెల్లో ప్రేమ‌ను ఒలికించి..మ‌న‌స్సుల్లో మమ‌త‌ను జోడించి ..పాడుకునేలా చేస్తాడు..బాలు అంటే పాట ..పాటంటే బాలు..ఆయ‌న లాగా పాడాల‌ని అనుకున్న వారంతా విఫ‌ల‌మైన వారే..కానీ ఆయ‌న మాత్రం ఎంద‌రికో గొంతుక‌నిచ్చారు. మ‌రెంద‌రికో పాట ఎలా ఉండాలో చూపించారు..ఎలా పాడాలో నేర్పించారు.

ఆయ‌న ప్ర‌భావం నాలుగు వ‌సంతాలు కాదు 74 ఏళ్ల‌నుకుంటే పొర‌పాటే..వేలాది మందిని గాయ‌కులుగా తీర్చి దిద్దారు. పుట్టుక నుంచి త‌నువు చాలించేంత దాకా బాలు క‌ష్ట‌ప‌డ్డారు. జీవితానికి స‌రిప‌డా కావాల్సినంత సౌక‌ర్యాలు స‌మ‌కూరినా ఏనాడూ వాటిని చూసి న‌వ్వుకున్నారే త‌ప్పా..పొంగి పోలేదు..డాబూ ద‌ర్పం ప్ర‌ద‌ర్శించ లేదు. ఆయ‌న అజాత‌శ‌త్రువు. కోట్లాది అభిమానుల‌ను సంపాదించుకున్న ఆయ‌న ఎవ‌రెస్టు శిఖ‌ర‌మంత ఎత్తుకు ఎదిగారు. 16 భాష‌లు..40 వేల‌కు పైగా పాట‌లు..ఆయ‌న సాధించిన విజ‌యానికి కొండ గుర్తులు మాత్ర‌మే. మ‌నం గొప్ప‌వాళ్ల‌మ‌ని అనుకున్న వాళ్లంతా ఇపుడు చిన్న పిల్ల‌ల్లా ఏడుస్తున్నారు.

సిరి వెన్నెల అయితే మ‌రీను..ఆయ‌న లేర‌న్న వార్త‌ను జీర్ణించు కోలేక పోతున్నారు. ఎందుక‌లా ఆయ‌న ఇంత ఇదిగా మ‌న‌ల్ని ఏడిపిస్తున్నారు. మ‌న బంధువా..లేక మ‌న‌కు కావాల్సిన వాడు..లేక మ‌న ఆత్మీయుడా..మ‌న ర‌క్తం పంచుకున్న వాడు..కాదు బాలు(SP Balasubramanyam)) ఈ దేశం గ‌ర్వించ‌ద‌గిన సంప‌ద‌. కొనలేని ఆస్తి..ఎల్ల‌వేళ‌లా మ‌న‌తోనే ఉంటారు..త‌న మాట‌ల‌తో మైమ‌రిచి పోయేలా చేస్తారు..పాట‌ల‌తో అల‌రిస్తూనే ఉంటారు. సాగ‌ర సంగ‌మ‌మై..స్వ‌ర్ణ క‌మలాన్ని ధ‌రించి..సిరి వెన్నెల‌గా మారి..రుద్ర‌వీణ‌ను మోగించి..శంక‌రాభ‌ర‌ణ‌మై మ‌నంద‌రి లోగిళ్ల‌లో పాట‌ల చెలికాడై చేరి పోయాడు. ప్ర‌తి ఒక్క‌రూ ఆప్యాయంగా పిలిస్తే ప‌లికే బాలూ స‌ర్..లేక పోవ‌డాన్ని జీర్ణించుకోలేక పోతున్నాం.

జీవిత‌మే నాట‌క‌రంగ‌మైన చోట‌..బాలు న‌టుడిగా..క‌విగా..ర‌చ‌యిత‌గా..గాయ‌కుడిగా..ప్ర‌యోక్త‌గా..ద‌ర్శ‌కుడిగా..సంగీత ద‌ర్శ‌కుడిగా..బ‌హు భాషా కోవిదుడిగా..ప్ర‌యోక్త‌గా..సినీ లోకాన్ని ప్ర‌భావితం చేశాడు. అన్ని పాట‌లూ గుర్తుంచు కోద‌గ్గ‌వే ఉన్నాయి. సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టు ..స‌మ‌యాన్ని..కాలాన్ని ఒడిసి ప‌ట్టుకుని మ‌న‌కు పాట‌ల‌లోని మాధుర్యాన్ని పంచాడు. తెలుగు సినిమా రంగానికే కాదు దేశానికి..ప్ర‌పంచపు రంగ‌స్థ‌లానికే త‌న అపురూప స్వ‌రంతో పేరు తీసుకు వ‌చ్చాడు. ఏ రంగంలో అయినా ఆయ‌న ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశాడు. గాత్ర ధార‌ణే కాదు గాంధ‌ర్వ లోకాన్ని సైతం త‌న గానంతో మెస్మ‌రైజ్ చేశాడు. ఏమి వింత మోహ‌మూ అంటూ అల్లారు ముద్దుగా ప‌లికిన ఆ స్వ‌రం ..విన్యాస‌మై లోక‌మంతటా అల్లుకుపోయింది. త‌ల్ల‌డిల్లేలా..త‌లుచుకునేలా..వ‌దులు కోలేనంత‌గా..ప్ర‌తి క్ష‌ణం..ప్ర‌తి నిమిషం..ప్ర‌తి రోజూ పాడుకునేలా..జ్ఞాప‌కం చేసుకునేలా చేసింది.

తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ ఇలా ప్ర‌తి భాష‌లో త‌న‌దైన ముద్ర‌ను వేశారు. సిరి మ‌ల్లె నీవే..మ‌ల్లెలు పూసే..ప్ర‌తి రాత్రి వ‌సంత రాత్రి..ప్ర‌తి గాలి పైర గాలి..వే వేలా గోపెమ్మ‌లా..నాద వినోదం..ఏ దేవి వ‌ర‌మో నీవు..ఇలా చెప్పుకుంటూ పోతే స్థ‌లం స‌రిపోదు..ఈ జీవితం నిండి పోతుంది. పాట‌ల తోట‌ల వ‌న‌మాలిగా సాహిత్యాన్ని సుసంప‌న్నం చేశాడు. ఇటు ద‌క్షిణాదిని అటు ఉత్త‌రాదిని బాలు కొన్నేళ్లు పాట‌ల‌తో అల‌రించాడు. పాడుకునేలా చేశాడు. ఇండియాలో బాలీవుడ్ హ‌వా కొన‌సాగుతున్న స‌మ‌యంలో బాల‌చంద‌ర్ తీసిన ఏక్ దూజే కేలియే సినిమాతో ఆయ‌న మెల్ల‌గా ప్ర‌వేశించాడు. ఆ త‌ర్వాత తానే పాట‌ల కెర‌ట‌మై సునామీ సృష్టించాడు. బాలు పాడిన తేరే మేరే బీచ్ మే అన్న పాట దేశ‌మంత‌టా వ్యాపించింది..మారు మోగించింది..కుర్ర‌కారు గుండెల్లో ప్రేమ మొల‌క‌ను నాటింది. అంతేనా దిల్ దీవానా దిల్ స‌జ్ నాకే మానేనా అంటూ పాడతే ప్ర‌పంచం ప‌ర‌వశించి పోయింది.

ఆంఖే తేరి బాహోమే అంటూ రోజా జానే మ‌న్ అనుకుంటూ కోట్లాది గుండెల్ని మీటిన ఘ‌న‌త బాలుదే. ఇక్క‌డా అక్క‌డా ప‌లు భాష‌ల‌తో బిజీగా ఉంటూనే ఒకే ఒక్క రోజు 21 పాట‌లు పాడి రికార్డు సృష్టించిన అరుదైన గాయ‌కుడు. బ‌తుక‌మ్మా బ‌తుక‌మ్మా అంటూ అల‌వోక‌గా పాడిన ఆ గాత్రం ..త‌కిట త‌థిమి తందానా..న‌రుడి బ‌తుకే న‌ట‌న అంటూ దివికేగాడు..బాలు ఓ క‌ల‌..ఓ నిజం..బాలు ఓ స్వ‌ప్నం..బాలు ఓ స‌ప్త‌వ‌ర్ణాలు క‌ల‌గ‌లిస‌న స్వ‌ర సంచారం..నింగీ నేలా గాలీ నీరు క‌ల‌గ‌లిసిన‌..స్వ‌ర మాంత్రికుడు..బాలూ(SP Balasubramanyam) స‌ర్..మీరు లేర‌ని ఎవ‌ర‌న్నారు..మీరెప్పుడూ మాతోనే ఉంటారు..ఉండి పోతారు..మేరున‌గ‌ధీరుడు..స‌మున్న‌త వ్య‌క్తిత్వపు ధీరోదాత్తుడు..స‌క‌ల క‌ళావ‌ల్ల‌భుడు..అమ‌రుడు..అజ‌రామ‌రుడు..ఉత్తుంగ త‌రంగాల‌ను పాట‌ల్లోకి వ‌లికించిన మహానుభావుడు. ఇక సెల‌వంటూ వెళ్లి పోయిన గాన గాంధ‌ర్వుడికి సెల్వూట్..!

( ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు సంద‌ర్బంగా మ‌రోసారి )

No comment allowed please