KTR: హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటాం – మాజీ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటాం - మాజీ మంత్రి కేటీఆర్‌

KTR: హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా, రాజ్యాంగం మార్చకుండా అడ్డుకొనే శక్తి ఒక్క బీఆర్ఎస్ కే ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) అన్నారు. వేములవాడ నియోజకవర్గం బూత్‌ కమిటీ సభ్యుల సమావేశంలో కరీంనగర్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌తో పాటు కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్(KTR) మాట్లాడుతూ… ‘‘2014లో బడా భాయి (మోదీ) మోసం చేసి ఓట్లు దండుకున్నారు. జన్‌ ధన్‌ ఖాతాలు తెరిస్తే ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఖాతాలో వేస్తామని ఓట్లు వేయించుకున్నారు. 2024లో ఆరు గ్యారంటీలు ఇస్తామని చోటా భాయి (రేవంత్ రెడ్డి) మోసం చేశారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన మోదీ… పదేళ్లలో ప్రజలను మోసం చేశారు. డీజిల్‌, పెట్రోల్‌ సహా నిత్యావసరాల ధరలు పెంచేశారు. రహదారుల నిర్మాణం కోసం సెస్‌ వసూలు చేసిన మోదీ… మళ్లీ ఇప్పుడు టోల్‌ రుసుము పేరుతో ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్పాలి. అలా రూ.30లక్షల కోట్లు వసూలు చేసి .. అందులో నుంచి రూ.14.50 లక్షల కోట్లు అదానీ, అంబానీ లాంటి వారందరి రుణాలన్నీ మాఫీ చేశారు.

KTR Comment…

కరీంనగర్‌ లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ. ఎందుకంటే టికెట్‌ విషయంలో రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌ మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగింది. కాంగ్రెస్‌ పార్లమెంట్‌ టికెట్‌ ను ప్రవీణ్‌రెడ్డి, జీవన్‌రెడ్డి ఆశించారు. కానీ, వారిద్దరిలో ఎవరికి ఇచ్చినా గట్టి పోటీ ఉంటుందని… ఇదే జరిగితే వినోద్‌ బయట పడతాడన్న ఉద్దేశంతో ముక్కు ముఖం తెలియని వ్యక్తిని నిలబెట్టారు. రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లో కరీంనగర్‌ కు డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారు. ఈ ఎన్నికల్లో 10… 12 ఎంపీ సీట్లు బీఆర్ఎస్ కు వస్తే కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు ఏడాదిలోపే వస్తుంది. 70 ఏళ్ల వయసులో తుంటి విరిగినా, కుమార్తె జైల్లో ఉన్నా, నమ్మినవాళ్లు మోసం చేసి వేరే పార్టీల్లోకి వెళ్తున్నా… కేసీఆర్‌ బస్సుయాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారు. కాబట్టి తల్లిలాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు పంచాయతీలు పక్కన పెట్టి ఎండను లెక్క చేయకుండా ముందుకు రావాలి’’ అని కేటీఆర్‌ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Also Read : Prajwal Revanna: విదేశాలకు దేవెగౌడ మనవడు ! అసభ్యకర వీడియోలే కారణమా ?

Leave A Reply

Your Email Id will not be published!