TDP-BJP-JSP Alliance Manifesto: రేపే టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మ్యానిఫెస్టో !

రేపే టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మ్యానిఫెస్టో !

TDP-BJP-JSP: ఏపీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లిలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించనున్నారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, బీజేపీ ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ‘రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం… రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం’, ‘పన్ను బాదుడు లేని సంక్షేమం – ప్రతి ప్రాంతం అభివృద్ధే లక్ష్యం’ తదితర నినాదాలతో ఉమ్మడి మ్యానిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం.

TDP-BJP-JSP Alliance Manifesto

అప్పులు, పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదని… సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామనే హామీని ఈ మేనిపెస్టో ద్వారా కూటమి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు పార్టీలకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీల కలబోతగా మ్యానిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం. దీనికి సంబంధించి మూడు పార్టీల నేతలతో ఏర్పాటు చేసిన కమిటీ ఈ అంశాలపై సుదీర్ఘ కసరత్తు చేసింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు, ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం, కార్యక్రమం ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీ నాయకత్వం తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే గత ఐదేళ్ళలో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం… వాటితో పాటు మరికొన్ని మాత్రమే కొత్త మేనిఫెస్టోలో చేర్చింది. దీనితో వైసీపీ మేనిఫెస్టోపై స్వంత పార్టీ నుండే మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి మేనిఫెస్టోపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read : Pulivarthi Nani: పులివర్తి నాని సెక్యూరిటీపై హైకోర్ట్ కీలక ఆదేశాలు !

Leave A Reply

Your Email Id will not be published!